రామయ్య వస్తున్నాడయ్యా | Sri Rama Navami Special: Upcoming Movies Update Based on Ramayana | Sakshi
Sakshi News home page
breaking news

రామయ్య వస్తున్నాడయ్యా

Apr 6 2025 1:29 AM | Updated on Apr 6 2025 5:28 AM

Sri Rama Navami Special: Upcoming Movies Update Based on Ramayana

తండ్రి మాటను జవదాటని తనయుడు... సోదరులను అభిమానించే అన్న... భార్య దూరమైనా ఆమె కోసమే జీవించిన ఏక పత్నీవ్రతుడు... ప్రజల క్షేమం కోరిన రాజు... ధర్మం తప్పని మహనీయుడు... ఇలా అన్నీ సుగుణాలున్నాయి కాబట్టే రాముడు ఆదర్శ్రపాయుడు. నేడు శ్రీరామ నవమి సందర్భంగా ‘రామాయణం’ ఆధారంగా రూపొందుతున్న చిత్రాల గురించి తెలుసుకుందాం...

రామాయణాన్ని ఒక్క సినిమాగా చెప్పడం కష్టం అంటున్నారు బాలీవుడ్‌ దర్శకుడు నితీష్‌ తివారి. అందుకే రెండు భాగాలుగా ఆయన ‘రామాయణ్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుగుణాల సుందరాంగుడు రాముడి పాత్రకు హ్యాండ్‌సమ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ని ఎంపిక చేసుకున్నారు. సుగుణవతి, సౌందర్యవతి సీతమ్మ పాత్రకు సాయి పల్లవిని తీసుకున్నారు. రావణుడిగా కన్నడ స్టార్‌ యశ్‌ నటిస్తున్నారు. దాదాపు రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌తో నమిత్‌ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యశ్‌ కూడా ఓ నిర్మాత.  

రాముడి పాత్ర నాకో కల: రణ్‌బీర్‌ కపూర్‌ 
‘‘ఇలాంటి అద్భుత చిత్రంలో భాగం కావడం గౌరవంలా భావిస్తున్నాను. ఈ చిత్రం తొలి భాగం షూటింగ్‌ పూర్తి చేశాను. త్వరలో రెండో భాగం చిత్రీకరణ ఆరంభిస్తాం. రాముడి పాత్రను ఎంతో వినయ విధేయతలతో చేస్తున్నాను. ఈ పాత్ర నాకో కలలాంటిది. ఈ సినిమాలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. మన భారతీయ సంస్కృతి గురించి చెప్పే సినిమా. అలాగే కుటుంబం, భార్యా–భర్తల అనుబంధాన్ని తెలియజేసే చిత్రం’’ అని రణ్‌బీర్‌ కపూర్‌ ఓ సందర్భంలో పేర్కొన్నారు.

ఇక నితీష్‌ తివారీ అయితే ‘‘ఈ అద్భుత ఇతిహాసాన్ని వెండితెరపైకి తీసుకురావడానికి పదేళ్ల క్రితమే అన్వేషణ మొదలుపెట్టాను. మన పవిత్రమైన చరిత్రకు దృశ్యరూపం ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల ఫొటోలను అధికారికంగా విడుదల చేయలేదు. షూటింగ్‌ స్పాట్‌లో రణ్‌బీర్‌–సాయి పల్లవిల ఫొటోలు లీక్‌ అయ్యాయి. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి, మలి భాగం 2027 దీపావళికి విడుదలవుతాయి.

ప్రశాంత్‌ వర్మ ‘జై హనుమాన్‌’ 
రాముడికి పరమ భక్తుడు ఆంజనేయుడు. తన జీవితం మొత్తం రాముడి సేవకే అంకితం చేశాడు. శ్రీరాముడు అంటే ఆంజనేయుడికి ఎంత భక్తి అంటే... తన ఛాతీ చీల్చితే అందులో సీతారాములే ఉంటారనేంతగా... రాముడి జీవితంలో ఎంతో కీలకమైన ఆంజనేయుడి పాత్ర కీలకంగా

ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జై హనుమాన్‌’. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన సూపర్‌ హిట్‌ మూవీ ‘హను–మాన్‌’కి ఇది సీక్వెల్‌. గతేడాది జనవరిలో అయోధ్యలో శ్రీరాముడి ప్రా ణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. అదే ఏడాది ఏప్రిల్‌లో హనుమాన్‌ జయంతి సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు ఆ శ్రీరాముడి ఆశీస్సులతో మాటిస్తున్నా... మీరందరూ జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ‘జై హనుమాన్‌’తో అద్భుతమైన అనుభూతిని అందిస్తా’’ అని పేర్కొన్నారు ప్రశాంత్‌ వర్మ.

శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటి? అనే ప్రశ్నకు సమాధానంగా ‘జై హనుమాన్‌’ని రూపొందిస్తున్నారని తెలిసింది. ఇక హనుమంతుడి పాత్రను ప్రముఖ కన్నడ స్టార్, ‘కాంతార’ ఫేమ్‌ రిషబ్‌ శెట్టి పోషిస్తున్నారు. గత ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేసిన ఆయన హనుమంతుడి లుక్‌కి మంచి స్పందన లభించింది. తొలి భాగంలో కనిపించిన తేజ సజ్జా ఈ చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆ మధ్య రానా, రిషబ్‌తో కలిసి ఉన్న ఫొటోను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసి, ‘జై జై హనుమాన్‌’ అని పోస్ట్‌ చేశారు ప్రశాంత్‌ వర్మ. దాంతో ఈ చిత్రంలో రానా నటిస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ‘హను–మాన్‌’ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిరంజన్‌ రెడ్డి నిర్మించారు. ‘జై హనుమాన్‌’ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై యలమంచిలి రవిశంకర్, నవీన్‌ ఎర్నేని నిర్మిస్తున్నారు. ఈ పాన్‌ ఇండియన్‌ మూవీని భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లోనూ రిలీజ్‌ చేయనున్నారు.

శ్రీరామ్‌ జై హనుమాన్‌ 
‘శ్రీరామ్‌ జై హనుమాన్‌’ పేరిట రామాయణం నేపథ్యంలో ఓ కన్నడ చిత్రం రూపొందుతోంది. ‘‘ఇప్పటి వరకూ రామాయణం ఆధారంగా పలు చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాల్లో చెప్పని కొత్త విషయాలను ఈ చిత్రంలో చెప్పనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘రామాయణం గురించి ఎవరికీ తెలియని అంశం’ అని అర్థం వచ్చే ట్యాగ్‌లైన్‌ ఈ చిత్రం పోస్టర్‌ మీద ఉంది. కాగా అయోధ్యలో శ్రీరాముడిప్రా ణ ప్రతిష్ఠ జరిగిన ముహూర్తానికి ఈ చిత్రం పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

అయితే నటీనటుల గురించి, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. అవధూత్‌ దర్శకత్వంలో కేఏ సురేష్‌ నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ చిత్రాలే కాదు... ఇంకా తెలుగులో ‘జర్నీ టు అయోధ్య’ అనే చిత్రం ప్రకటన వెలువడింది. ఇంకా రామాయణం నేపథ్యంలో మరికొన్ని చిత్రాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. 
– డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement