
మరో తెలుగు సినిమా ఎలాంటి చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వీకెండ్ ఇప్పటికే షో టైమ్, మార్గన్, సారథి తదితర తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు బిగ్‌బాస్ గౌతమ్ మూవీ కూడా కేవలం మూడు వారాలకే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడూ చూద్దాం.
ప్రస్తుతం చిన్న సినిమాలని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవట్లేదు. మరీ బాగుంది అనే టాక్ వస్తే తప్పితే థియేటర్లకు వెళ్లి వాటిని చూసేందుకు ఆసక్తి చూపించట్లేదు. అయినా సరే యంగ్ హీరోలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ.. ఈనెల 4న 'సోలో బాయ్' చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేశాడు. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది గానీ స్టార్ నటీనటులు లేకపోవడంతో ఒకటి రెండు రోజులకే బిగ్ స్క్రీన్ నుంచి మాయమైపోయింది.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)
ఇప్పుడు ఆహా ఓటీటీలోకి శుక్రవారం సాయంత్రం నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ముందుగా ఎలాంటి ప్రకటన లేకుండా సడన్ అందుబాటులోకి వచ్చింది. వీలుంటే దీనిపై ఓ లుక్కేయొచ్చు. బిగ్‌బాస్ 7, 8 సీజన్లలో పాల్గొన్న గౌతమ్ కృష్ణ.. అంతకు ముందు ఒకటి రెండు సినిమాలు చేశాడు. కానీ ఇది కాస్తోకూస్తో సందడి చేసింది.
'సోలోబాయ్' విషయానికొస్తే.. కృష్ణమూర్తి(గౌతమ్ కృష్ణ) మిడిల్ క్లాస్ కుర్రాడు. ఇంజినీరింగ్ చదువుతూ ప్రియ(రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. ఓ సందర్భంలో ఆమె బ్రేకప్ చెప్పడంతో మందుకు బానిసైపోతాడు. తండ్రి ప్రోత్సాహంతో మళ్లీ మాములు మనిషిగా మారి ఉద్యోగంలో చేరతాడు. అక్కడ శ్రుతి(శ్వేత అవస్తి)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. జీవితం సాఫీగా సాగుతుందన్న సమయంలో తండ్రి మరణిస్తాడు. మరోవైపు ఆర్థిక పరిస్థితుల వల్ల భార్య శ్రుతి విడాకులు ఇస్తుంది. ఓ పక్క తండ్రి చావు, మరోవైపు భార్య విడాకులు.. వీటన్నింటిని తట్టుకొని కృష్ణ మూర్తి మిలియనీర్‌గా ఎలా ఎదిగాడు? అనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))
