
నాగచైతన్యతో పెళ్లి తర్వాత ఇప్పుడిప్పుడే పలు కొత్త సినిమాలకు నటి శోభిత ధూళిపాళ ఓకే చెబుతుంది. పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె టాప్ మోడల్‌గా గుర్తింపు పొందారు. అలా పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన శోభిత 2016లో రామన్ రాఘవన్ 2.0 అనే హిందీ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగులో మేజర్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు పొందారు. అలా హిందీ, తెలుగు, మలయాళం చిత్రాల్లో నటించిన శోభిత 2022లో మణిరత్నం సినిమా పొన్నియిన్ సెల్వన్ 1, 2 చిత్రాల్లో వానతి అనే పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు.
అదేవిధంగా హాలీవుడ్‌లో మంకీ మాన్ చిత్రంలో నటించి పాన్ వరల్డ్ నటిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా మరోసారి తమిళ ప్రేక్షకులను ఆలరించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న వెట్టువన్ చిత్రంలో హీరోయిన్‌గా ఆమె నటిస్తున్నట్లు తెలిసింది. ఇంతకుముందు అట్టకత్తి, కబాలి, సార్పట్టా పరంపరై వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన పా.రంజిత్ ఇటీవల విక్రమ్ కథానాయకుడుగా తంగలాన్ చిత్రం చేశారు. తాజాగా వట్టువన్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

గోల్డెన్ రేష్మియా ఫిలిమ్స్‌తో కలిసి నీలం స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో అట్టకత్తి దినేష్ కథానాయకుడుగా, ఆర్య ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం గ్యాంగ్ స్టర్స్ ఇతివృత్తంతో రూపొందుతున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రస్తుతం కారైక్కుడి ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ నటిస్తున్న పాత్ర ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది.