3800 మంది పిల్లల ప్రాణాలు కాపాడిన సింగర్‌.. ఏకంగా గిన్నిస్‌ బుక్‌లో! | Singer Palak Muchhal enters into Guinness records for this Reason | Sakshi
Sakshi News home page

Palak Muchhal: 3800 మంది పిల్లల ప్రాణాలు కాపాడిన సింగర్‌.. ఏకంగా గిన్నిస్‌ బుక్‌లో!

Nov 11 2025 3:55 PM | Updated on Nov 11 2025 4:29 PM

Singer Palak Muchhal enters into Guinness records for this Reason

జీవితంలో కెరీర్, సంపాదన మాత్రమే ముఖ్యం కాదు. సమాజానికి కూడా ఉపయోగ పడే పనులు చేయాలంటోంది సింగర్ పాలక్ ముచ్చల్. తాజాగా ఆమె అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆమె రికార్డ్‌ సాధించింది సింగర్‌గా అనుకుంటే పొరపాటే. తన గాత్రంతో అభిమానులను అలరించే పాలక్ ముచ్చల్‌.. పసిపిల్లల ప్రాణాలను కూడా కాపాడుతోంది. తన ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.

ఇండోర్‌కు చెందిన పాలక్ సమాజానికి తన వంతుగా సేవ చేస్తోంది. ఇప్పటి వరకు పేద పిల్లల కోసం దాదాపు 3,800కి పైగా గుండె శస్త్రచికిత్సలకు నిధులు సమకూర్చింది. ఆమె సేవలను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ గుర్తించింది. అంతకుముంందే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న సింగర్.. తాజాగా గిన్నిస్‌ బుక్‌లోనూ తన పేరును లిఖించుకుంది.

సింగర్ పాలక్ ముచ్చల్ తన చిన్నప్పటి నుంచే సేవభావాన్ని అలవరచుకుంది. తన సంపాదనలో కొంతభాగం పేద పిల్లల సంక్షేమం కోసం వెచ్చిస్తోంది. ఆమె కేవలం పిల్లలకు మాత్రమే కాదు.. కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు సైతం అండగా నిలిచింది. అంతేకాకుండా గుజరాత్ భూకంప బాధితుల కోసం రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చింది. సామాజిక సంక్షేమం పట్ల ఆమె నిబద్ధతను చూసి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా.. సింగర్ పాలక్ ముచ్చల్‌ బాలీవుడ్‌లో 'మేరీ ఆషికి', 'కౌన్ తుఝే', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' వంటి పాటలతో ఫేమ్ తెచ్చుకుంది. అలా తన పాటల ద్వారా వచ్చిన సంపాదనను ఫౌండేషన్‌కు కేటాయిస్తోంది. ఈ విషయంలో ఆమె భర్త, స్వరకర్త మిథూన్ కూడా అండగా ఉన్నారు. ఆమె సేవ ప్రయాణంలో కూడా భాగస్వామిగా ఉన్నారు. మాకు ఆదాయం లేకపోయినా కూడా పిల్లల శస్త్రచికిత్స ఎప్పటికీ ఆగదని మిథున్ అన్నారు. ఎన్ని ఆర్థిక అడ్డంకులు ఉన్నప్పటికీ మా సంకల్పం కోసం కృషి చేస్తామని వెల్లడించారు. దీంతో వీరిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement