Sakshi News home page

60 ఏళ్ల క్రితం తండ్రికి ఇచ్చిన మాట.. ఇప్పటికీ దాటని ఏసుదాస్‌

Published Fri, Jan 12 2024 7:17 AM

Singer KJ Yesudas Why Not Enter Politics - Sakshi

సినిమాకు ఆరో ప్రాణం పాట. ఆ పాటకు ఊపిరిగా గాన సరస్వతి ఏసుదాస్‌. ఈయన పేరుకు మాత్రమే మలయాళి. గాయకుడుగా సర్వభాషి. ఈయన పాడారంటే ఆ చిత్రం ప్రత్యేకత సంతరించుకుంటుంది. తన మధురమైన కంఠంతో ఇప్పటి వరకు 40వేలకు పైగా పాటలను పాడిన ఘనత ఏసుదాసుది. 1980 ప్రాంతంలో ఈయన అత్యధికంగా పాటలను పాడారు. ఒక సమయంలో ఏసుదాస్‌ పాడని చిత్రమే లేదంటే అతిశయోక్తి కాదు. 8 జాతీయ అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌ బిరుదులకు పొందారు. బుధవారం తన 84వ పుట్టినరోజు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో రాజకీయ రంగ ప్రవేశంపై వచ్చిన చర్చకు ఆయన స్పందించారు. ఎందరో సినీ ప్రముఖులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారని ముఖ్యంగా సంగీత రంగానికి చెందిన ఇళయరాజా కూడా ఓ జాతీయ పార్టీలో చేరారని, అలాంటిది ఇన్నేళ్లుగా ప్రఖ్యాత గాయకుడిగా రాణిస్తున్న మీరు రాజకీయ రంగ ప్రవేశం చేరకుండా పోవడానికి కారణం ఏమిటి అన్న ప్రశ్నకు ఏసుదాస్‌ బదులిచ్చారు. నిజం చెప్పాలంటే పలు రాజకీయ పార్టీల నుంచి తనకు పిలుపు వచ్చిందని తెలిపారు.

అయితే చిన్న వయసులోనే తన తండ్రి రాజకీయాల్లోకి వెళ్లవద్దని గట్టిగా చెప్పారన్నారు. అప్పుడే తాను ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి వెళ్లనని మాట ఇచ్చానన్నారు. అలా తన తండ్రికి ఇచ్చిన మాటను మీర దలుచుకోలేదని చెప్పారు. అందుకే రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. కొందరు తన పేరుతో అభిమాన సంఘాన్ని ప్రారంభించమని సలహా ఇచ్చారని, తాను తోసిపుచ్చినట్లు చెప్పారు. ఇంకా చెప్పాలంటే తనకు ఇప్పటికే సోషల్‌ మీడియా ఖాతా కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement