
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పరమ్ సుందరిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా కనిపించనుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. డిఫరెంట్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. కేరళకు చెందిన అమ్మాయితో ఢిల్లీ అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందోట్రైలర్లో చూపించారు.
అయితే పరమ్ సుందరి ట్రైలర్తోనే ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఈ ట్రైలర్లో చర్చిలో వచ్చే సీన్పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రార్థన మందిరంలో ఆ రొమాన్స్ సీన్స్ ఏంటని.. ఆ సన్నివేశాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వాచ్‌డాగ్ ఫౌండేషన్ సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ సన్నివేశాన్ని సినిమా వెంటనే తొలగించాలని లేఖలో కోరింది.
ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి దురుద్దేశంతో ఇలాంటి సీన్స్ సృష్టించే ధోరణిని అరికట్టాల్సిన అవసరం ఉందని వాచ్‌డాగ్ ఫౌండేషన్‌కు చెందిన న్యాయవాది గాడ్‌ఫ్రే పిమెంటా అన్నారు. చర్చి ఒక పవిత్రమైన ప్రార్థనా స్థలమని.. దానిని అసభ్యకరమైన కంటెంట్‌కు వేదికగా చిత్రీకరించవద్దని లేఖలో పేర్కొన్నారు. ఇలా చేయడం తమ ఆధ్యాత్మిక పవిత్రతను అగౌరవపరచడమే కాకుండా కాథలిక్ సమాజాన్ని కించపరచడమేనని లేఖలో వివరించారు. తమ మనోభావాలను దెబ్బతీసినందుకు పరమ్ సుందరి నిర్మాత, దర్శకుడితో పాటు నటీనటులపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది.