
కోలీవుడ్ భామ శృతి హాసన్ తాజాగా కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రజినీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ నాగార్జున అక్కినేని కీలక పాత్రలో కనిపించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శృతి హాసన్ తన తండ్రి మూవీ థగ్ లైఫ్‌పై స్పందించింది. కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఫెయిల్యూర్ గురించి మాట్లాడింది.
తన తండ్రికి డబ్బు ముఖ్యం కాదని శృతి హాసన్ తెలిపింది. సినిమా సక్సెస్ కావడానికి కేవలం కలెక్షన్ నంబర్స్ ప్రామాణికం కాదని వెల్లడించింది. నేను కూడా ఒక నటిగా ఆ విషయం గురించి ఎప్పుడు ఆలోచించలేదు.. ఇది రూ. 200 కోట్ల సినిమానా, రూ.300 కోట్ల సినిమానా అని తాను కూడా పట్టించుకోనని పేర్కొంది. నాకు చివరి విడత చెల్లింపులు వచ్చాయన్నదే మాత్రమే చూస్తానని తెలిపింది.
నాన్న సంపాదించిన డబ్బునంతా సినిమాల్లో పెట్టేందుకు వెనకాడని మనస్తత్వం ఉన్న వ్యక్తి అని శృతిహాసన్ అన్నారు. సినిమాల్లో వచ్చిన డబ్బును ఆయన రెండో ఆస్తిగానో.. లేదంటే మూడో కారు కొనేందుకో ఖర్చు చేయలేదని తెలిపారు. తన తండ్రి డబ్బు అంతా తిరిగి సినిమాల్లోనే పెట్టారని వెల్లడించారు. మీరు ఊహించిన విధంగా బాక్సాఫీస్ నంబర్స్ ఆయనను ఎలాంటి ప్రభావితం చేస్తాయని తాను అనుకోవడం లేదన్నారు.
కాగా.. దాదాపు 38 ఏళ్ల తర్వాత కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో థగ్ లైఫ్ సినిమాను తెరకెక్కించారు. నాయకన్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో అభిమానులు సైతం భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఊహించని విధంగా 'థగ్ లైఫ్' బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. ఈ చిత్రంలో శింబు, త్రిష కృష్ణన్, నాజర్, జోజు జార్జ్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్ కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల కంటే తక్కువ వసూళ్లు సాధించి డిజాస్టర్గా మిగిలిపోయింది.