దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణించిన ఉత్తరాది భామల్లో శ్రియ ఒకరు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ తదితర భాషల్లో నటించి పేరు తెచ్చుకున్న ఈ నటిలో మంచి డాన్సర్ ఉన్నారు. గ్లామర్‌కు అయితే కొదవ లేదు. పాత్రలకు న్యాయం చేసే నటనా ప్రతిభ కూడా తోడుంది. వీటన్నింటికి తోడుగా అదృష్టం కలిసి రావడంతో తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాలను అందుకున్నారు. అలా దాదాపు రెండు దశాబ్దాలపాటు కథానాయికగా నటించారు.
హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా
2018లో శ్రియ తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రీ కోస్కీవ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బిడ్డ పుట్టింది. పెళ్లి తరువాత కొంత కాలం నటనకు దూరంగా ఉన్న ఈమె ఇటీవల మళ్లీ నటించడం మొదలెట్టారు. అయితే కథానాయికగా కాకుండా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అదే విధంగా ప్రత్యేక పాటల్లోనూ నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అలా ఇటీవల సూర్య కథానాయకుడిగా నటించిన రెట్రో చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నటించారు.
అదే నా అందానికి రహస్యం
తెలుగు చిత్రం మిరాయిలో ముఖ్య భూమిక పోషించారు. ఇప్పుడీమె వయసు 43 ఏళ్లు. ఈ వయసులోనూ తన అందాలను కాపాడుకుంటూ హోయలొలికిస్తున్నారు. తాజాగా తన బ్యూటీ రహస్యాన్ని ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాయామం, ఆహారపు అలవాట్లు వంటి వాటికంటే మంచిని వినడం, మంచివి చూడడం, మంచి చేయడం వంటి విషయాలతో సౌందర్యం మన నుంచి దూరం కాదు అని పేర్కొన్నారు. సాధారణంగా చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అంటారు. దీనికి నటి శ్రియ కొత్త అర్థాన్ని చెబుతూ దాన్ని అందంతో పోల్చడం విశేషం!


