బాలీవుడ్‌లో క్రేజీ కథానాయికల్లో ఒకరుగా రాణిస్తున్న నటి శ్రద్ధాకపూర్( Shraddha Kapoor ). అందాల ఆరబోతకు వెనుకాడని ఈ అమ్మడు కథానాయకిగా 15 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఇటీవల స్త్రీ–2 చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. 38 ఏళ్ల ఈ మహారాష్ట్ర బ్యూటీ ఆ మధ్య ప్రభాస్‌కు జంటగా సాహో చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. చాలా మంది బాలీవుడ్ భామలు దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.
అదేవిధంగా శ్రద్ధాకపూర్ దృష్టి దక్షిణాదిపై పడింది. ఇప్పటివరకు కోలీవుడ్‌లో నటించని ఈ బ్యూటీకి తాజాగా ఆ కోరిక నెరవేరబోతోందని సమాచారం. ఇంతకుముందు అజిత్ హీరోగా విడాముయర్చి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మగిళ్ తిరుమేణి ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో చిన్నగ్యాప్ తీసుకున్నారు. తాజాగా తన తర్వాత చిత్రానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

దీన్ని ఆయన తమిళం, హిందీ భాషల్లో రూపొందించనున్నట్లు తెలిసింది. ఇందులో విజయ్‌సేతుపతి హీరోగా నటించనున్నారని, ఆయనకు జంటగా శ్రద్ధాకపూర్‌ను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. అదేవిధంగా సంజయ్‌దత్‌ను విలన్ పాత్రలో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


