శ్రద్ధా కపూర్ లీడ్ రోల్లో వస్తోన్న హిస్టారికల్ బయోపిక్ ఈథ. ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా.. ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ప్రముఖ జానపద కళాకారణి విఠాబాయి నారాయణ్‌గావ్‌కర్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ఛావా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌తోనే అంచనాలు పెరిగాయి. ఈ బయోపిక్‌లో రణదీప్ హూడా, మహమ్మద్ జీషన్ అయ్యూబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న 'ఈథ ఆగష్టు 28, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
టైటిల్‌పై వివాదం..
ఈ మూవీని ప్రముఖ కళాకారిణి విఠాబాయి జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఆమె అత్యంత గౌరవరప్రదమైన జానపద కళాకారిణులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి ఆమె జీవితంపై వస్తోన్న మూవీ టైటిల్ ఈథ అని పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఈ టైటిల్‌ను మార్చాలన్న డిమాండ్ పెరుగుతోంది. బయోపిక్‌కు విఠాబాయి పేరు ఎందుకు పెట్టలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేకర్స్ ప్రశ్నించింది.
తాజాగా విఠాబాయి వారసులు సైతం ఈథ టైటిల్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఆమె కుమారులు కైలాష్, రాజేష్ నారాయణ్‌గావ్‌కర్, మనవడు మోహిత్ నారాయణ్‌గావ్‌కర్ సైతం టైటిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టైటిల్‌పై చిత్ర నిర్మాతలు తమ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతున్నారు. ఆమె జీవిత చరిత్రకు ఆమె పేరునే పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం సినిమా పేరుకు సంబంధించిన విషయం కాదని... మహారాష్ట్రలో గొప్పగా భావించే లావణి, తమాషా సంప్రదాయాన్ని తీర్చిదిద్దడంలో సహాయపడిన విఠాబాయికి తగిన గుర్తింపునివ్వాలని కోరుతున్నారు. 'విఠా' లేదా 'విఠాబాయి' అని ఎందుకు పేరు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వివాదంపై దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ కానీ.. మ్యాడాక్ ఫిల్మ్స్ గానీ స్పందించలేదు.
విఠాబాయి నారాయణ్‌గావ్‌కర్ ఎవరు?
విఠాబాయి నారాయణ్‌గావ్‌కర్ మహారాష్ట్రకు చెందిన జానపద కళాకారిణి. ఆమె స్థానిక లావణి, తమాషా సంప్రదాయ కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నరాు. ఆమె తన కెరీర్‌లో అత్యంత గౌరవనీయమైన జానపద కళాకారిణులలో ఒకరిగా నిలిచి తరతరాలకు స్ఫూర్తిగా నిలిచారు. భారతీయ జానపద కళలకు ఆమె చేసిన సేవలను భారత రాష్ట్రపతి 1957, 1990లో గుర్తించారు. కానీ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ.. విఠాబాయి చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో పోరాడారు.


