గత కొన్నిరోజులుగా నాగార్జున 'శివ' సినిమా రీ రిలీజ్ హడావుడి నడుస్తోంది. తాజాగా(నవంబరు 14) మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా ఇదే చిత్రంలో కీలక పాత్ర చేసి క్రేజ్ తెచ్చుకున్న నటుడు చిన్నాని 'సాక్షి' ఇంటర్వ్యూ చేసింది. అసలు ఇందులో అవకాశం ఎలా వచ్చింది? షూటింగ్ అనుభవాలు ఏంటి? తదితర బోలెడు విషయాల్ని పంచుకున్నారు. అలానే 'అమ్మోరు' సినిమా తనని మానసికంగా ఎలాంటి ఇబ్బంది కలిగించిందనేది కూడా బయటపెట్టారు.
(ఇదీ చదవండి: పాస్‌పోర్ట్ లేకుండా కంగారుపడి వచ్చేయకండి: మహేశ్)
'ఆర్టిస్ట్‌గా ట్రయల్స్ చేసినప్పుడు నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆఫీస్‌లో ఉండేవాడిని. ఆయన ద్వారా ఒకటి రెండు చిన్న చిన్న వేషాలు కూడా వచ్చాయి. మనీ, రాత్రి చిత్రాల్లో హీరోగా చేస్తున్నప్పుడు 'అమ్మోరు' మూవీలో విలన్‌గా నన్ను పెట్టాలని ఫిక్సయ్యారు. యేలేటి రామారావు డైరెక్టర్. నాకు కథ చెప్పిన తర్వాత గెటప్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది కొన్ని వేసి చూపించాను కూడా'
'షూటింగ్, గ్రాఫిక్స్ అయిపోయాయి. డబ్బింగ్ మాత్రమే చెప్పాలి. లండన్ నుంచి కెమెరామ్యాన్ వచ్చాడు. ఖాజాగూడ కొండపై నెలరోజులపాటు క్లైమాక్స్ కూడా చేశాం. ఏడాదిన్నర పాటు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. వేరే ఏ మూవీ కూడా చేయలేదు. ఒక గ్రాఫిక్ సీన్ కోసం అయితే పద్మాలయ స్టూడియోలో 72 గంటల పాటు నిద్రకూడా పోకుండా పనిచేశాను. అయితే డైరెక్టర్.. చివరవరకు రషెస్ చూడరు. ఫైనల్‌గా చూసుకున్న తర్వాత ఆయన అనుకున్న విజన్ రావట్లేదు. బాగా డిసప్పాయింట్ అయిపోయి, అసలు ఏం చేయాలి ఈ సినిమాని అని అప్పుడు కోడి రామకృష్ణ దగ్గరకు వెళ్లారు'
(ఇదీ చదవండి: వేడుకగా తెలుగు సీరియల్ నటి సీమంతం)
'కోడి రామకృష్ణ.. ఫుటేజీ అంతా చూస్తూనే చిన్నా విలన్ ఏంటి? అని అన్నారు. చిన్నా.. పెద్ద కామెడీ స్టార్, చిన్నా విలన్ ఏంటి? దీన్ని నేను చేయలేను. మరి ఏం చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు చిన్నాని మార్చి వేరే వాళ్లని పెట్టాలి. అప్పుడు కోడి రామకృష్ణ.. రామిరెడ్డిని విలన్‌గా తీసుకున్నారు. నన్ను మూవీ నుంచి తీసేశారు. ఏడాదిన్నర పాటు కష్టపడితే నన్ను తీసేసేసరికి.. ఈ ఇండస్ట్రీ వద్దు అని చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఊరికి వెళ్లిపోదాం అనుకున్నాను'
'కానీ అదే టైంలో కొన్ని సినిమాల్లో ఛాన్సులొచ్చాయి. సరే మన వృత్తి ఇదే కదా అని చేస్తున్నాను గానీ ఎక్కడో లోపల బాధ. చెప్పాలంటే 'అమ్మోరు' కోసం ఆర్జీవీ 'గాయం' కూడా వదిలేసుకున్నాను. ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోదాం అనుకున్నానంటే ఎంత డిసప్పాయింట్ అయ్యుంటానో ఆలోచించండి. ఆ కారణం వల్లే చాలారోజుల పాటు హైదరాబాద్‌కి షిఫ్ట్ కాలేదు. ఆ బాధ పోవడానికి నాలుగైదేళ్లు పట్టింది' అని చిన్నా.. అప్పటి సంగతుల్ని గుర్తుచేసుకున్నారు.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన స్టార్ డైరెక్టర్ సినిమా)


