తెలుగు సినిమా చరిత్ర,ఇండియన్ సినిమా గతిని మలుపు తిప్పిన కల్ట్ క్లాసిక్ ‘శివ’. అప్పటివరకు తెలుగు తెరపై చూడని బొమ్మని శివలో చూపించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అందుకే తెలుగు సినిమాను శివకు ముందు.. శివకు తర్వాత అని డిఫైన్ చేస్తారు. అయితే ఈ సినిమా ప్రభావం తెలుగు తెరకే పరిమితం కాలేదు.. అన్ని భాషల చిత్రాలకు మరో కొత్త మార్గం చూపించింది. ఎంతలా అంటే.. కన్నడ ఇండస్ట్రీలో గొప్పగా చెప్పుకునే ‘ఓం’ సినిమా స్క్రిప్ట్‌నే మార్చేసేలా చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఓం దర్శకుడు ఉపేంద్రనే చెప్పాడు.
తాజా ఇంటర్వ్యూలో ఉపేంద్ర మాట్లాడుతూ, “నేను కాలేజీ రోజుల్లోనే ఒక గ్యాంగ్‌స్టర్ కథ రాసుకున్నాను. కానీ ‘శివ’ విడుదలైన తర్వాత నా కథ దాదాపు ఒకేలా ఉందని గ్రహించాను. ప్లాగియారిజం ఆరోపణలు రాకుండా స్క్రిప్ట్‌ను పూర్తిగా మార్చేశాను. రెండేళ్లు కష్టపడి కొత్త స్క్రీన్‌ప్లేతో ‘ఓం’ను తెరకెక్కించాను” అని చెప్పారు.
శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన ఓం కన్నడ సినిమా చరిత్రలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచి, అత్యధిక సార్లు (550కు పైగా) రీ-రిలీజ్ అయిన రికార్డును సృష్టించింది. 'ఓం'కు ప్రేరణ తన స్నేహితుడు పురుషోత్తమ్ జీవితంలో జరిగిన నిజమైన సంఘటన అని ఉపేంద్ర గతంలో వెల్లడించారు. 'శివ' చిత్రం తెలుగు సినిమాను మార్చేసినట్లే, 'ఓం' కన్నడ ఇండస్ట్రీలో గ్యాంగ్‌స్టర్ జోనర్‌కు కొత్త ఒరవడి ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ కూడా తన 'సత్య' చిత్రానికి 'ఓం' నుంచి ప్రేరణ పొందినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉపేంద్ర, శివరాజ్‌కుమార్ కలిసి అర్జున్ జన్య దర్శకత్వంలో ‘45’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
"When I saw #Shiva, I left that script for two years and it kept haunting me.
Then I thought of making the screenplay of #OM in a different way."
– #Upendra | #NagarjunaAkkineni pic.twitter.com/A6mkbLvCNQ— Whynot Cinemas (@whynotcinemass_) December 22, 2025


