
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక పుకారు వినిపిస్తూనే ఉంటుంది. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి, ప్రాజెక్టుల గురించి ఎన్నో ఊహాగానాలు వస్తుంటాయి. అయితే కొందరు మరీ హద్దు మీరుతూ.. తారలు బతికుండగానే చనిపోయారనే గాసిప్స్ కూడా సృష్టిస్తుంటారు. అయితే ఇలాంటి గాసిప్ తనమీద కూడా వచ్చిందని చెప్తోంది బాలీవుడ్ నటి శిల్ప శిరోద్కర్ (Shilpa Shirodkar).
చనిపోయానని పుకారు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శిల్ప శిరోద్కర్ మాట్లాడుతూ.. 1995లో నేను రఘువీర్ సినిమా చేశాను. ఆ మూవీ షూటింగ్ కోసం టీమ్ అంతా కులుమనాలీ వెళ్లాం. ఓ పత్రికలో నేను చనిపోయానని వార్త వచ్చిందట! ఆ విషయం నాకు తెలిదు. అప్పుడు మా దగ్గర సెల్‌ఫోన్స్ లేవు. నేను షూటింగ్ లొకేషన్‌లో ఉండగా మా నాన్న హోటల్‌కు పలుమార్లు ఫోన్ చేశాడు. సునీల్ శెట్టితో కలిసి ఓ సీన్‌లో నటిస్తుంటే అక్కడున్న అందరూ కూడా నేను శిల్పాశెట్టియేనా? లేదా మరో వ్యక్తినా? అన్నట్లు కాస్త విచిత్రంగా చూస్తున్నారు.

25 మిస్‌డ్ కాల్స్
అప్పటికే అందరూ పత్రికలో నా మరణ వార్త చదివేశారు. నేను హోటల్ గదికి వెళ్లేసరికి దాదాపు 25 మిస్‌డ్ కాల్స్ ఉన్నాయి. పేపర్‌లో నేను చనిపోయానన్న వార్త చూసి అమ్మానాన్న చాలా కంగారుపడిపోయారు. అయితే ఈ గాసిప్‌ను సృష్టించింది బయటవాళ్లు కాదు, సినీ నిర్మాత గుల్షన్ కుమార్ (Gulshan Kumar). అప్పట్లో పీఆర్ స్టంట్లు ఏవీ లేవు. మా మూవీ బజ్ కోసం ఇలా నేను చనిపోయానని కథలు అల్లేశారు. కనీసం అందుకు నా అనుమతి కూడా తీసుకోలేదు.
నాకు చెప్పకుండా..
అంతా అయిపోయాక అసలు విషయం బయటపెట్టారు. సినిమా వర్కవుట్ అయింది కాబట్టి వాళ్లపై కోపం రాలేదు అని శిల్ప శిరోద్కర్ చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అనేక సినిమాలు చేసిన శిల్ప శిరోద్కర్ తెలుగులో బ్రహ్మ అనే ఏకైక సినిమాలో నటించింది. ప్రస్తుతం తెలుగులో సుధీర్‌బాబు 'జటాధర' మూవీలో కీలక పాత్రలో యాక్ట్ చేస్తోంది.