మా వంటబ్బాయి చెప్పిన కథ విని ఆశ్చర్యపోయా: దర్శకుడు శేఖర్‌ కపూర్‌ | Shekhar Kapur Says His Cook Came Up With Best Plot For Mr India 2 | Sakshi
Sakshi News home page

‘మిస్టర్‌ ఇండియా–2’ కోసం మా వంటబ్బాయి అద్భుతమైన కథ చెప్పాడు: శేఖర్‌ కపూర్‌

May 6 2025 11:25 AM | Updated on May 6 2025 12:33 PM

Shekhar Kapur Says His Cook Came Up With Best Plot For Mr India 2

ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సమ్మిట్‌’ (వేవ్స్‌)– 2025’ ని ఈ నెల 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాలుగురోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్‌ ఆదివారంతో ముగిసింది. 

‘వేవ్స్‌’ సమ్మిట్‌కి హాజరైన ప్రముఖ దర్శకుడు, ‘మిస్టర్‌ ఇండియా’ చిత్రం ఫేమ్‌ శేఖర్‌ కపూర్‌(Shekhar Kapur ) మాట్లాడుతూ–‘‘నా దృష్టిలో ఏఐ అనేది పెద్ద డెమొక్రటిక్‌ టూల్‌. వినోదరంగ పురోగతి కోసం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది చూడాలి కానీ, అతిగా భయపడడం అనవసరం. ఉదాహరణకు, నా ‘మిస్టర్‌ ఇండియా–2’(Mr India 2 ) కోసం కథ ఆలోచిస్తూ ఉంటే, ఒకరోజు మా వంటబ్బాయి అద్భుతమైన కథ చెప్పాడు. ఏ అనుభవం లేని అతనికి ఆ ఆలోచన ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతూ అడిగా. ‘చాట్‌ జీపీటీలో అడిగితే చెప్పింద’ని మా కుక్‌ జవాబు ఇచ్చేసరికి ఆశ్చర్యపోవడం నా వంతు అయింది’’ అని తన వ్యక్తిగత అనుభవం పంచుకున్నారు.

 ‘‘అయితే ఏఐ, చాట్‌ జీపీటీలు ఎంత గొప్పవైనా, మనం వాటి మీద అతిగా ఆధారపడితే బద్ధకం పెరుగుతుంది. ఎందుకూ కొరగాకుండా పోతాం. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా మానవ మేధనూ, ఒరిజినాలిటీనీ అవి అధిగమించలేవు’’ అని నమ్మకం వ్యక్తం చేశారు. 
  
ప్రపంచంలోని అన్ని రంగాలనూ కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావితం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వెండితెరపై కథ, కథనం ఎలా మారనుంది? అనే ఆసక్తికరమైన ప్రశ్నకు శేఖర్‌ కపూర్‌  దగ్గర ఉన్న జవాబు ఏంటి? ‘వేవ్స్‌’కు హాజరైన ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ–‘‘ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా దాన్ని అందిపుచ్చుకోవాలి. లేదంటే మనం వెనకబడిపోతాం’’ అన్నారు. 

‘‘మారుతున్న కాలంతో పాటు వస్తున్న అనేక కొత్త టెక్నాలజీలు, మాధ్యమాలు తమవైన ఆడియన్స్‌ను సృష్టించుకుంటాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో వెండితెరపై వినోదం చూడడం తక్కువ అవుతోంది. మహా అయితే 2 శాతం ఉంటుందేమో! ఇతరేతర మాధ్యమాల్లో చూస్తున్నారు, వినోదం పొందుతున్నారు. ఇది గమనించి దానికి తగ్గట్టుగా మనమూ మారాలి’’ అని అభిప్రాపడ్డారు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ–‘‘ఏఐ అనేది అప్పటికే అందుబాటులో ఉన్న అపరిమిత సమాచారం ఆధారంగా నడుస్తుంది. కానీ మానవ జీవితం రేపు ఎలా ఉంటుందో ముందే తెలియకుండా మిస్టరీగా అనునిత్యం ముందుకు సాగుతుంది. జీవితంలోని విశేషం అదే’’ అని అంతర్జాతీయంగా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌కు సైతం నామినేటైన ఈ దర్శకుడు విశ్లేషించారు.                    
– సాక్షి ప్రత్యేక ప్రతినిధి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement