సినిమా అంటే నాకు ఒక కల, ఒక బాధ్యత: నిర్మాత శ్రీహన్సిక పెద్దిరెడ్డి | Producer Hansika Peddireddy New Film Pooja Ceremony Highlights | Sakshi
Sakshi News home page

సినిమా అంటే నాకు ఒక కల, ఒక బాధ్యత: నిర్మాత శ్రీహన్సిక పెద్దిరెడ్డి

Feb 28 2026 4:05 PM | Updated on Feb 28 2026 4:05 PM

Producer Hansika Peddireddy New Film Pooja Ceremony Highlights

హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన కథాంశంతో కొత్త చిత్రం ప్రారంభం

ఎవర్ గ్రీన్ జానర్ అయిన లవ్ డ్రామాకు వినోదాన్ని జోడిస్తూ, హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఒక ప్రెస్టేజీయస్ ప్రాజెక్ట్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. సరికొత్త కథాంశంతో, యువతను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శనివారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు సన్నిహితులు హాజరై విజయాశీస్సులు అందించారు. ముహూర్తపు షాట్‌కు శ్రీధర్ పెద్దిరెడ్డి క్లాప్ కొట్టగా, స్రవంతి పెద్దిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. ఈ చిత్రంలో యువ జంట జగన్ యోగి రాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ యంగ్ టాలెంట్ తో పాటు సీనియర్ నటులు దేవీ  ప్రసాద్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. లక్ష్మణ్ మీసాల,  పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ..సినిమా అంటే నాకు ఒక కల, ఒక బాధ్యత. అందుకే నా మొదటి చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాను. యువత మనసు దోచుకునే ప్రేమ కథతో పాటు, ప్రతి కుటుంబం ఆస్వాదించే వినోదం మా చిత్రంలో ఉంటుంది. నాణ్యమైన నిర్మాణ విలువలతో, సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. భవిష్యత్తులో మా బ్యానర్ నుండి మరిన్ని మంచి చిత్రాలు రావడానికి ఇది పునాది లాంటిది’ అని పేర్కొన్నారు.

దర్శకుడు రఘువర్ధన్ కోట్ల మాట్లాడుతూ, త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను, టైటిల్‌ను అతి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement