
బయోపిక్‌లకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అందుకు ఛావా సినిమానే నిదర్శనం. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. దాదాపు రూ.140 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఛావా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూలు చేసింది. విక్కీ కౌశల్ నటప్రభంజనానికి ఫుల్ మార్కులు పడ్డాయి.
బయోపిక్ లేనట్లే?
అయితే ఛత్రపతి శివాజీరాజా బయోపిక్ (Chhatrapati Shivaji Biopic) కూడా వస్తోందంటూ అప్పట్లో ఓ ప్రకటన వచ్చింది. ప్రముఖ దర్శకుడు అమిత్ రాయ్.. షాహిద్ కపూర్‌ను శివాజీగా చూపించనున్నాడని ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో కానీ ఈ మూవీ అటకెక్కిందట! ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా వెల్లడించాడు. అమిత్ రాయ్ మాట్లాడుతూ.. సిస్టమ్ చాలా దారుణంగా ఉంది. నేను డైరెక్ట్ చేసిన ఓమైగాడ్ 2 మూవీ రూ.180 కోట్లు సాధించింది.
ఎలా పనిచేస్తా?
అయినప్పటికీ.. నా పనితనం నిరూపించుకోవడానికి ఇది సరిపోదట! నటీనటుల ఎంపిక, ప్రొడక్షన్, మేనేజ్‌మెంట్.. ఇలాంటి వ్యవస్థల కింద నలుగుతూ ఒక దర్శకుడు ఎలా పని చేయగలడు? ఐదేళ్ల జీవితాన్ని ఒక కథకు అంకితం చేస్తే.. కొందరు సడన్‌గా వచ్చి అందులో ఇది తప్పు, అది తప్పు అని ప్రతిదానికి వంకపెడితే ఎంత బాధగా అనిపిస్తుంది అంటూ ఆ ప్రాజెక్టును పక్కనపెట్టేసినట్లు చెప్పకనే చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. కొందరు హీరోలు కేవలం బాక్సాఫీస్ లెక్కల్నే చూస్తారు.
హీరోలకు లవ్‌స్టోరీలే కావాలి
మరికొందరు మాత్రం నిజాయితీగా కథల్ని మాత్రమే నమ్ముతారు. కానీ, చాలామంది సమాజంలోని చేదు నిజాలను కళ్లకు కట్టినట్లు చూపించే సినిమాల్లో భాగమవడానికి బదులుగా ప్రేమకథా చిత్రాలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అని చెప్పుకొచ్చాడు. అమిత్ రాయ్ ప్రస్తుతం అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠితో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. షాహిద్ కపూర్ విషయానికి వస్తే.. ఈయన చివరగా దేవా చిత్రంతో డిజాస్టర్ అందుకున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా యాక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది.