హృదయాలను స్పృశించే చిత్రం ‘ఎ సీన్ ఎట్ ది సీ’ .. స్టోరీ ఇదే! | Sakshi
Sakshi News home page

A Scene at the Sea:హృదయాలను స్పృశించే చిత్రం ‘ఎ సీన్ ఎట్ ది సీ’ .. స్టోరీ ఇదే!

Published Sun, Jan 7 2024 11:48 AM

A Scene at the Sea Movie Review In Telugu - Sakshi

కొన్ని సినిమాలకు భాషతో సంబంధం ఉండదు. అది విడుదలై ఏళ్లు గడుస్తున్నా..ఇప్పుడు చూసినా ఏదో కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. అలాంటి సినిమాల్లో జపనీస్‌ సినిమా ఎ సీన్ ఎట్ ది సీ(A Scene at the Sea) ఒకటి. తకాషి కిటానో  దర్శకత్వం వహించిన ఈ సినిమా 1991లో రిలీజైన మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా గొప్పదనం ఏంటంటే.. హీరో హీరోయిన్ల పాత్రలు మాట్లాడలేవు.. వినలేవు. ఇద్దరూ చెవిటి, మూగలే. 

కథ విషయానికొస్తే.. ఒక మూగ చెవిటి  అబ్బాయి. ఆ అబ్బాయికి ఒక స్నేహితురాలు, ప్రాణం, నేస్తం, ప్రేయసి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి కూడా చెవిటీ మూగే. అబ్బాయేమో నగర పారిశుద్ధ్య విభాగంలో  పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ అబ్బాయికి సముద్రపు ఒడ్డు దారిలో ఒక విరిగిన  సర్ఫ్ బోర్డ్‌ కనపడుతుంది. దానిని మిగతా చెత్తలో చెత్తగా కలిపెయ్యక ఇంటికి తెచ్చుకుని చిన్నపాటి మరమ్మత్తు అదీ చేసి రోజూ తనూ, తన అమ్మాయి కలిసి  తాను దొరికించుకున్న ఆ సర్ఫ్ బోర్డ్‌ ను చంకలో ఇరికించుకుని సంద్రం దగ్గరికి వెళ్ళి ఆ అలల మధ్యలో తానూ, తన బోర్డ్ ఇరువురు మునకలయ్యి . మునకలని జయించి  తేలింతలవదామని  ప్రయత్నించి అలా  తేలలేక మునిగి మునిగి మళ్ళీ మళ్ళీ మునిగి ఒడ్డున కూర్చున్న ఇతర మనుష్యుల పెదాల చివర పకపకలై ఎగతాళి వెక్కిరింతలై  వెనక్కి మరల్తూ ఉంటాడు.

కొంతకాలానికి ఆ సర్ఫ్ బోర్డ్‌  కాస్త విరిగి పొతుంది. అప్పుడేమవుతుందంటే ఆ సినిమా చూస్తూ మనం ఆ యువ స్నేహితులిద్దరి మొహాల మీద దిగాలు పువ్వులమవుతాం. నీ దగ్గరింతా నా దగ్గరింతా అని డబ్బులు లెక్కెట్టుకుని కొత్త బోర్డ్ కొనుక్కోవడానికి దుకాణానికి వెళ్ళి డబ్బు సరిపోక ఇద్దరూ వెనక్కి మళ్ళితే ఆ ఇద్దరి దిగాలు నడకలలో మనమూ  కూరుకు పోయి వాడిపోయిన అడుగుజాడల అడుగులో మొహాలు దాచుకుని వెక్కివెక్కి ఏడ్పులం కూడా అవుతాం, మరి కొన్ని రోజులకు ఇంకొంచెం డబ్బులు సంపాదించుకుని వారు  ఆ సర్ఫ్ బోర్డ్ కొనుక్కున్నప్పుడు,  చొక్కా అంచు పైకెత్తుకుని కన్నీళు తుడుచుకుని విప్పారిన ముఖాలతో సూర్యకాంతి వెలుగులం కూడ మనమే అవుతాం. 

కాలం గడుస్తూ గడుస్తూ ఆ కుర్రవాడు సముద్ర అలలను, వెక్కరింతలను, కన్నీళ్లని, దిగులు కొట్టిన మబ్బు మొహం మీద పట్టుదలను పాతి సముద్రాన్ని జయించి అలల  నురుగు మీద గుర్రపు స్వారి చేయడం మొదలెడతాడు. అప్పుడు పిల్లవాడిని కిండేలు చేసిన వాళ్ళందరూ కూడా అరేని! అని  ఆశ్చర్యపోయి మంచివాళ్లయి   మనతో పాటూ ఆ అబ్బాయిని చూసిన వారయ్యి  పరమానందమవుతారు. అలా అలా మెల్లగా ఆ అబ్బాయి ఒక చిన్న పోటిలో పాల్గొని సముద్రం అలలను  జయించి  ఒక చిన్న కప్పు కూడా గెల్చుకుంటాడు.

అందరూ కలిసి అక్కడ సముద్రపు ఒడ్డున కొన్ని చిన్న చిన్న సిగ్గులతో సహా ఒకటీ రెండూ ఫోటోలు కూడా దిగుతారు. అబ్బాయి సంతోషంగా ఉంటాడు. అబ్బాయిని చూసి అమ్మాయి కూడా సంతోషంగా ఉంటుంది. వారిద్దరి సంతోషాన్ని చూసి భరించలేని ఆకాశం భోరుమని  కన్నీరు పెట్టుకుంటుంది. ఆ వర్షపు కన్నీరు లో తడుచుకుంటూ ఆ అబ్బాయి ఎప్పటిలాగే ఆ రోజు కూడా సముద్రపు అలలని జయించుదామని బయలుదేరుతాడు. ఏడుపు గొట్టు ఆకాశాన్ని తోడేసుకున్న మాయదారి సముద్రం ఈంత  నోరు తెరిచి ఆ  మూగ చెవిటి పిల్లవాడిని తినేస్తుంది.  సర్ఫ్ బొర్డ్ ప్లాస్టిక్ శరీరం మాత్రం రుచించక దాన్ని ఊసేస్తుంది. అబ్బాయిని వెదుక్కుంటూ నీలి గొడుగు వేసుకుని వచ్చిన అమ్మాయికి అబ్బాయి ఎంతకు కనపడ్డు. ఒడ్డున కొట్టుకు వచ్చిన బోర్డ్ తప్పా. వర్షం శాంతిస్తుంది.  మడత పెట్టిన నీలి గొడుగు అమ్మాయి కంటి చివర నీరవుతుంది. సినిమా అయిపోతుంది. 

సినిమా మొత్తం మీద మాటలు తక్కువ. ఒక జెన్ భావనను దృశ్య రూపంలో అలా కళ్లముందు  ఎక్కువగా కదల్లాడ్డం తప్పా. ఇది ప్రపంచ సినిమా. ప్రపంచ సినిమా అంటే   ప్రపంచంలో ఏ మూలన ఉన్న ఎవరినయినా ఒకేలా మనసును పెనవేసుకుని  స్పృశించే గాలి వంటింది అని అర్థం. ప్రపంచ సినిమా . ప్రపంచ సాహిత్యం. దయ - కరుణ -కన్నీళ్ళు  వంటివి ఇవన్నీ అందరివి. అందరిని ఒకేలా అంటేవి. ఐక్యమానవీయత అంటే అదే. అది ఇదే, ఈ సినిమా మనకు కలిగించేదే!

Advertisement
 
Advertisement