Rohit Sharma - Sofia Hayat: రోహిత్‌ శర్మతో డేట్‌ చేశా: నటి బ్రేకప్‌ లవ్‌ స్టోరీ

Rohit Sharma Sofia Hayat Breakup Love Story In Telugu - Sakshi

రోహిత్‌ శర్మ.. క్రికెట్‌ మైదానంలో హిట్‌మన్‌గా ప్రసిద్ధుడు. ఇండియన్‌ ఒపెనింగ్‌ బాట్స్‌మన్‌. సోఫియా హయత్‌.. సంచలనాలకు మారుపేరు. బ్రిటిష్‌ మోడల్, సింగర్, యాక్ట్రెస్‌.. టెలివిజన్‌ పర్సనాలిటీ.. బిగ్‌బాస్‌ (హిందీ) పోటీదారు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. విరబూసి జీవితాలను పండించేలోపే వాడిపోయింది. ఆ ఫెయిల్యూర్‌ స్టోరీ ఎలా మొదలైందంటే..

2012.. లండన్‌లోని ఓ క్లబ్‌లో రోహిత్‌ను కలిసింది సోఫియా. ఆమె నటించిన సినిమా పూర్తయిన సందర్భంగా ఇస్తున్న పార్టీలో. ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా రోహిత్‌ ఆ పార్టీకి వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. అది మొదలు లండన్, ముంబై, ఢిల్లీలో జరిగిన ఇంకెన్నో పార్టీల్లో కలుసుకున్నారు. మంచి స్నేహితులుగా మారారు. ఇంకొన్నాళ్లకే ప్రేమికులయ్యారు. చెట్టాపట్టాల్‌.. చెట్టుపుట్టల్‌.. హాలిడేయింగ్స్‌.. సర్వసాధారణమే! కానీ ఆ ప్రేమను బయటపడనివ్వకుండా గుట్టుగానే దాచుకున్నారు. కాదు.. దాచుకున్నామని అనుకున్నారు. మీడియా పట్టేసింది. ఆ వార్తలను హెడ్‌లైన్స్‌గా మార్చి బాగా ప్రచారం చేసింది.

ఇటు క్రికెట్‌ ఫీల్డ్‌లో.. అటు సినిమా, మోడలింగ్‌ ఫీల్డ్‌లో ఈ జంట ప్రేమ చర్చనీయాంశమైంది. అది ఆ ఇద్దరి చెవిన పడినా రూమర్‌ అన్నట్టుగానే పట్టించుకోలేదు. ఏనాడూ మీడియా ముందు గానీ.. సోషల్‌ మీడియాలో గానీ ప్రస్తావించలేదు. ఆ ఇద్దరి మధ్య బ్రేకప్‌ అయ్యాకే తమ మధ్య ప్రేమవ్యవహారం నడిచిందని ట్విటర్‌ వేదికగా ప్రకటించింది సోఫియా... ‘ఓకే.. ఈ వదంతులకు నేటితో.. ఫుల్‌స్టాప్‌ పెడుతున్నాను. యెస్‌..రోహిత్‌ శర్మతో నేను డేట్‌ చేశాను. కానీ ఇప్పుడా ప్రేమ బ్రేక్‌ అయిపోయింది. మళ్లీ మేం కలిసేది లేదు.. మా ఆ అనుబంధాన్ని పునరుద్ధరించుకునే ఆసక్తీ లేదు. ఇప్పుడు నేనో మంచి మనిషి తోడు కోసం వేచి చూస్తున్నాను’ అంటూ. నువ్వంటే నువ్వని.. మూడేళ్ల ముచ్చటగా 2015లో ముగిసిపోయిన ఆ బ్రేకప్‌కు కారణం రోహిత్‌ శర్మ అంటుంది సోఫియా. ‘సోఫియానే’ అంటారు రోహిత్‌ శర్మ సన్నిహితులు.

‘నా గురించి మీడియా ఎప్పుడు వివరం అడిగినా.. సోఫియా నా ఫ్యాన్‌ అనే చెప్పాడు తప్ప లవ్‌ అని చెప్పలేదు. నా గురించి నిజం చెప్పడానికి అంతగా ఇబ్బందిపడే వ్యక్తితో ప్రేమేంటి అని బ్రేకప్‌ చేసేసుకున్నా’ అని చెప్పింది సోఫియా ఒక ఇంటర్వ్యూలో. రోహిత్‌ శర్మ సన్నిహితుల కథనం ప్రకారం.. సోఫియా, విరాట్‌ కొహ్లీల స్నేహం. ఆమె.. విరాట్‌తో చెలిమి పెంచుకొని అతనితో చనువుగా మసలుకోవడం వల్లే రోహిత్‌.. సోఫియాకు దూరమయ్యాడని అంటారు. సోఫియాతో కలిసి ఉన్నప్పుడు రోహిత్‌ శర్మ తమ ప్రేమానుబంధం గురించి ఎలా పెదవి విప్పలేదో విడిపోయిన తర్వాతా ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు. కనీసం సోఫియా ట్వీట్లకు కౌంటర్‌ కూడా ఇవ్వలేదు.

చదవండి: స్టూడియోలో వాంతులు చేసుకున్న ప్రదేశాన్ని శుభ్రం చేసేదాన్ని

‘రోహిత్‌ను పరిచయం చేస్తూ అతను క్రికెటర్‌ అని చెప్పాడు నా ఫ్రెండ్‌. అతను నాకు పరిచయం అయ్యేవరకు అతనో క్రికెటర్‌ అని నాకు తెలియదు. ఎందుకంటే క్రికెట్‌ అంటే నాకు పెద్దగా ఆసక్తి లేదు.. మ్యాచెస్‌ను చూడలేదు కూడా. కాని తొలి పరిచయంలోనే రోహిత్‌ నచ్చాడు. వాట్‌ ఏ కూల్‌ మ్యాన్‌ అనుకున్నాను. మా స్నేహం పెరిగే కొద్దీ నిజంగానే అతను మంచి మనిషిగానే కనిపించసాగాడు నాకు. చాలా సెన్సెటివ్‌. క్రికెట్‌ గురించి, ఫ్యాన్స్‌ గురించి చెప్పేవాడు. బాగా ఆడకపోతే ఫ్యాన్స్‌ ఎలా రియాక్ట్‌ అవుతారో చెప్పేవాడు. ఆ భావోద్వేగాల గురించి గంటలు గంటలు డిస్కస్‌ చేసుకునే వాళ్లం. అంతా బాగానే ఉంది.. సజావుగా సాగిపోతోంది అనుకుంటున్నప్పుడే రోహిత్‌ను ఒకసారి మీడియా అడిగింది ఆయన లైఫ్‌లో నేనేంటి అని. దానికి రోహిత్‌ అసలేం తడుముకోకుండా తను జస్ట్‌ ఫ్యాన్‌ అంతే. అంతకుమించి మరేం లేదు అని ఆన్సర్‌ చేశాడు.ఆ జవాబు.. చెప్పిన తీరును ఎందుకో రిసీవ్‌ చేసుకోలేకపోయాను. చాలా బాధపడ్డాను. ఇక ఆ ప్రేమ ముందుకు సాగదని అర్థమైంది. అందుకే వద్దనుకున్నాను’ అని ట్విటర్‌ ముఖంగా వెల్లడించింది.

సోఫియాతో విడిపోయాక 2015లోనే రితికా సజ్‌దేను ప్రేమ వివాహం చేసుకున్నాడు రోహిత్‌. ఇప్పుడు వాళ్లకొక పాప సమైరా. సోఫియా.. తన జీవితాన్ని పుస్తకంగా రాసే పనిలో ఉంది. అందులో రోహిత్‌ శర్మతో తన ప్రేమ జీవితం కూడా ఉంటుందని చెప్పింది.
- ఎస్సార్‌

చదవండి: వెబ్‌ సిరీస్‌తో పాపులారిటీ సంపాదించుకున్న మోడల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top