
సాక్షి, హైదరాబాద్: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj)కు ఇచ్చిన హామీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించారు. సొంత కృషితో ఎదిగిన అతడు తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని పేర్కొన్నారు.
పాతబస్తీ నుంచి ఆస్కార్ వరకు..
హైదరాబాద్.. పాతబస్తీ కుర్రాడైన రాహుల్ సిప్లిగంజ్.. తన సింగింగ్ టాలెంట్‌తో అంచెలంచెలుగా ఎదిగాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నాటు నాటు పాటతో అంతర్జాతీయ స్థాయిలో సంగీత ప్రియులను అలరించాడు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే! ఆస్కార్ అవార్డు పొందిన తర్వాత రాహుల్‌కు 2023 మే 12న టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి రూ.10 లక్షల నగదు ప్రోత్సాహం అందించారు.
గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్‌లోనూ..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కోటి రూపాయల నగదు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. ఇటీవల గద్దర్ అవార్డుల సందర్భంగా కూడా రాహుల్ సిప్లిగంజ్‌ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వం నుంచి బహుమతి ఉంటుందని సీఎం రేవంత్ చెప్పారు. నేడు (జూలై 20న) పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్‌కు రూ.కోటి నజరానా ప్రకటించారు.
చదవండి: క్యాన్సర్.. బతకడం కష్టమన్నారు.. ఆస్పత్రిపై నుంచి దూకి..