
నాకు క్యాన్సర్ అని తెలియగానే నిశ్చేష్టుడినయ్యాను. బతికే అవకాశాలు తక్కువ అని చెప్పడంతో ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను అని చెప్తున్నాడు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి, యాక్షన్ డైరెక్టర్ శామ్ కౌశల్ (Sham Kaushal). తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో శామ్ కౌశల్ మాట్లాడుతూ.. 2003లో ఓ సర్జరీ చేయించుకున్నాను. ఆ సమయంలో నాకు క్యాన్సర్ ఉందన్న విషయం బయటపడింది. బతకడం కష్టమే అని డాక్టర్స్ చెప్పగానే నాతో ఉన్నవారి ముఖాలు వాడిపోయాయి.
చావంటే భయం లేదు
హాస్పిటల్‌లోని మూడో అంతస్తు నుంచి దూకి చనిపోవాలనుకున్నాను. ఎలాగో చావు తప్పదన్నాక ఇంకా దేనికి బతికుండటం? అని భావించాను. కానీ అప్పటికే సర్జరీ జరగడం వల్ల నొప్పితో కదల్లేకయ్యాను. లేచి నడిచేందుకు ఒంట్లో సత్తువ లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నాను. క్యాన్సర్ వల్ల మరణిస్తానని తెలిశాక చావంటే భయం లేకుండా పోయింది. జీవితాన్ని చూసే విధానమే మారిపోయింది. ఏడాది పాటు పలు టెస్టులు, సర్జరీలు చేశారు. ఏదైతే అదయిందని నేను ధైర్యంగా నిలబడ్డాను.
పదేళ్ల ఆయుష్షు కోరితే..
అదృష్టవశాత్తూ క్యాన్సర్ నా శరీరమంతా వ్యాపించలేదు. అప్పుడు ఆ భగవంతుడిని మరో పదేళ్ల జీవితం ప్రసాదించమని వేడుకున్నాను. కానీ క్యానర్‌ను జయించి 22 ఏళ్లవుతోంది. ఇన్నేళ్లలో ఎంతోమంది మంచివాళ్లను కలిశాను, నా పిల్లలు కెరీర్‌లో రాణిస్తున్నారు. నేనూ జీవితంలో మంచి స్థాయికి చేరుకున్నాను అని చెప్పుకొచ్చాడు. శామ్ మొదట్లో స్టంట్‌మ్యాన్‌గా పని చేశాడు. 1990లో ఇంద్రజలం అనే మలయాళ చిత్రంతో యాక్షన్ డైరెక్టర్‌గా మారాడు.
సినిమాలు
నాలుగు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్, భాగ్ మిల్కా భాగ్, పీకే, పద్మావత్, సంజు, సింబా వంటి పలు చిత్రాలకు యాక్షన్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఆస్కార్ విన్నింగ్ మూవీ స్లమ్ డాగ్ మిలియనీర్‌కు సైతం పని చేశాడు. ఆయన కుమారులు విక్కీ కౌశల్, సన్నీ కౌశల్.. ఇద్దరూ బాలీవుడ్‌లో హీరోలుగా రాణిస్తున్నారు.
చదవండి: పారితోషికం భారీగా పెంచేసిన జాన్వీ.. ‘పెద్ది’కి ఎంతంటే..