తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రెజీనా కసాండ్రా. తాజాగా ఈ నటి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో ప్రేమలో ఎదురైన చేదు అనుభవాలు, ఆ సమయంలో పడిన మానసిక వేదన గురించి మాట్లాడారు.
‘2020లో నా ప్రేమ బ్రేకప్ అయింది. ఆ బంధంలో నేను దారుణంగా మోసపోయా. నమ్మిన మనిషే వెన్నుపోటు పొడవడంతో నా మనసు ముక్కలైంది’ అని రెజీనా పేర్కొన్నారు. ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా కాలం పట్టిందని, ఆ సమయంలో తనకు ఎదురైన మానసిక వేదనను మాటల్లో చెప్పలేనని తెలిపారు.
ప్రేమించుకోవడం నేర్చుకున్నా..
‘నా సమయాన్ని, నా ఆలోచనలను నాకోసమే కేటాయించుకోవాలని నిర్ణయించుకున్నాను. సరిగ్గా అదే సమయంలో కరోనా లాక్‌డౌన్ మొదలైంది. ఆ సమయం నాకు ఒక విధంగా వరంగా మారింది. బయటి ప్రపంచానికి దూరంగా ఉంటూ నన్ను నేను ప్రేమించుకోవడం నేర్చుకున్నాను. ఆ రోజుల్లో నాకు నేను ఇచ్చుకున్న ధైర్యమే ఈ రోజు నన్ను ఈ స్థాయి ప్రశాంతతకు చేర్చింది’ అని రెజీనా వివరించారు.
కెరీర్‌లో కొత్త ప్రయోగాలు..
తెలుగులో 'శివ మనసులో శృతి', 'రొటీన్ లవ్ స్టోరీ', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'ఎవరు' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రెజీనా.. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల అజిత్ నటించిన తమిళ చిత్రం 'విడాముయర్చి'లో ప్రతినాయిక పాత్రలో కనిపించి మెప్పించారు. హీరోయిన్‌గా అలరించిన రెజీనా.. ఇప్పుడు ప్రతినాయిక పాత్రలతోనూ తన నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. అలా ఈ రోజు విడుదలైన నయనతార ‘మహాశక్తి’ మూవీలోనూ నెగిటివ్ రోల్‌లో ప్రేక్షకులను మెప్పించారు.
(ఇదీ చదవండి: నయనతార ‘మహాశక్తి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)


