హిట్‌ బొమ్మలు 'రీ రిలీజ్‌' | Re-releases trend in Telugu film industry | Sakshi
Sakshi News home page

హిట్‌ బొమ్మలు 'రీ రిలీజ్‌'

May 9 2025 2:37 AM | Updated on May 9 2025 3:13 AM

Re-releases trend in Telugu film industry

మళ్లీ ప్రేక్షకుల ముందుకు హిట్‌ బొమ్మలు

చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్‌ కొనసాగుతుంటుంది. అదే కోవలో ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్‌ల ట్రెండ్‌ కొనసాగుతోంది. గతంలో హిట్‌గా నిలిచిన సినిమాలను రీ రిలీజ్‌ చేసేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు మేకర్స్‌. హీరోల పుట్టినరోజు కావచ్చు.. లేదా ఆ సినిమాకి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన రోజు కావచ్చు.. లేకుంటే ఆ సినిమాకి ఉన్న ప్రత్యేకమైన క్రేజ్‌... ఇలా సందర్భాలను బట్టి తమ సినిమాలను రీ రిలీజ్‌ చేసేందుకు హీరోలు, దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

పైగా హిట్‌ సినిమాలను రీ రిలీజ్‌ చేస్తుండటంతో ఆయా హీరోల అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు వస్తున్నాయి. ఆ కోవలో భాగంగా ఈ నెలలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి, దేశముదురు, జల్సా, యమదొంగ, వర్షం, ఖలేజా’ వంటి హిట్‌ బొమ్మలు (చిత్రాలు) ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఆ విశేషాలేంటో చూద్దాం....  

ముప్పై ఐదేళ్ల తర్వాత... 
ముప్పై ఐదేళ్ల తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చిరంజీవి హీరోగా నటించిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ఒకటి. ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్‌గా నటించారు. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అమ్రిష్‌ పురి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామిరెడ్డి, బేబీ షాలినీ, బేబీ షామిలీ వంటి వారు కీలకపాత్రలుపోషించారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌ నిర్మించిన ఈ సినిమా 1990 మే 9న విడుదలైంది.

సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలోనిపాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. చిరంజీవి కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిన సినిమా ఇది. ఈ చిత్రం విడుదలై 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా నేడు ఈ సినిమా రీ రిలీజ్‌ అవుతోంది. అప్పట్లో ఈ సినిమాని రీల్‌ రూపంలో ప్రదర్శించారు. అయితే ఇప్పుడంతా డిజిటల్‌ మయం కావడంతో రీల్‌లో రిలీజ్‌ చేయడం కుదరదు.

అందుకే 2018 నుంచి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ నెగటివ్‌ రీల్‌ కోసం వెతుకులాట మొదలుపెట్టిన యూనిట్‌కి.. 2021లో విజయవాడలోని అ΄్పారావు అనే వ్యక్తి వద్ద ఒక ప్రింట్‌ రీల్‌ దొరికింది. ఆ రీల్‌ కూడా దుమ్ము, ధూళి పట్టడం.. అక్కడక్కడా గీతలు పడటంతో పెరిగిన సాంకేతికతని బేస్‌ చేసుకుని ఎంతో శ్రమించి రీల్‌లోని ఈ సినిమాని 8కే రెజల్యూషన్‌లో డిజిటలైజ్‌ చేసి 4కే ఔట్‌పుట్‌గా మార్చారు మేకర్స్‌. ఈ ప్రింట్‌ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని చిత్రయూనిట్‌ చెబుతోంది. 2డీతోపాటు ఈ చిత్రం 3డిలోనూ విడుదల కానుండటం విశేషం.

దేశముదురు మళ్లీ వస్తున్నాడు... 
తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మరోసారి వస్తున్నాడు దేశముదురు. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన చిత్రం ‘దేశముదురు’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా హన్సిక టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2007 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో తొలిసారి సిక్స్‌ప్యాక్‌ బాడీలో కనిపించారు అల్లు అర్జున్‌. సన్యాసిగా మారిన వైశాలిని (హన్సిక) ప్రేమించి, ఆ ప్రేమకథను సుఖాంతం చేసుకునే బాల గోవింద్‌పాత్రలో అల్లు అర్జున్‌ నటించారు. ఈ చిత్రానికి దివంగత మ్యూజిక్‌ డైరెక్టర్‌ చక్రి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అప్పట్లో ఈ సినిమాలోనిపాటలు ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచాయనడం అతిశయోక్తి కాదు. బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా పద్దెనిమిదేళ్ల తర్వాత రీ రిలీజ్‌కి ముస్తాబైంది. ఈ నెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు మేకర్స్‌.  

కరో కరో జల్సా...  
‘హే సరిగమ పదనిస కరో కరో జర జల్సా...’ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు పవన్‌ కల్యాణ్‌. ఆయన హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘జల్సా’. ఇలియానా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలోపార్వతీ మిల్టన్, కమలినీ ముఖర్జీ, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, ముఖేష్‌ రిషి వంటి వారు కీలకపాత్రలుపోషించారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించిన ఈ చిత్రం 2008 ఏప్రిల్‌ 1న రిలీజై హిట్‌గా నిలిచింది. నక్సలైట్‌ (మావోయిస్టు) నుంచి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన సంజయ్‌ సాహుపాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ఈ సినిమాకి ప్లస్‌గా మారింది. 17ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్‌ కానుంది. ఈ నెల 16న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు.  

పుట్టినరోజు కానుకగా... 
‘రేయ్‌.. పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో చూసుకో... పులితో ఫొటో దిగాలనిపించిందనుకో కొంచెం రిస్క్‌ అయినా పర్లేదు ట్రై చేయొచ్చు... సరే చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది’ అంటూ ‘యమదొంగ’ సినిమాలో ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగులు ఎంతపాపులర్‌ అయ్యాయో తెలిసిందే. ఆయన హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యమదొంగ’. ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్‌గా నటించగా మంచు మోహన్‌బాబు, మమతా మోహన్‌దాస్, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, ఖుష్బు వంటి వారు కీలకపాత్రలుపోషించారు.

హీరోయిన్‌ రంభ ఈ చిత్రంలో ‘నాచోరే నాచోరే...’ అంటూ ఎన్టీఆర్‌తో కలిసి తనదైన డ్యాన్సుతో అదరగొట్టారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రాజా అనే దొంగపాత్రలో ఎన్టీఆర్‌ నటించారు. యమధర్మ రాజుపాత్రలో మోహన్‌బాబు నట విశ్వరూపం చూపించారు. రమా రాజమౌళి సమర్పణలో చెర్రీ, ఊర్మిళ నిర్మించిన ఈ సినిమా 2007 ఆగస్టు 15న రిలీజై సూపర్‌ హిట్‌గా నిలిచింది. అంతేకాదు.. ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం కూడా ప్లస్‌ అయ్యింది. ఈ సినిమాని 17 ఏళ్ల తర్వాత రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నెల 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ మూవీని ఈ నెల 18న రిలీజ్‌ చేస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఈ చిత్రాన్ని 4కేలో రీ రిలీజ్‌ చేస్తున్నారు.

వర్షం వస్తోంది...   
మండు వేసవిలో థియేటర్లలో ప్రేక్షకులపై చల్లని వర్షపు జల్లులు కురిపించనున్నారు ప్రభాస్‌. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘వర్షం’. శోభన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించారు. హీరో గోపీచంద్‌ విలన్‌పాత్రపోషించారు. ఎంఎస్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం 2004 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘ఈశ్వర్, రాఘవేంద్ర’ వంటి చిత్రాల తర్వాత ప్రభాస్‌ నటించిన మూడో చిత్రం ‘వర్షం’. ఈ చిత్రం ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది.

అంతేకాదు కెరీర్‌ ఆరంభంలో యూత్‌లో ప్రభాస్‌కు మంచి ఫాలోయింగ్‌ని, ఫ్యాన్స్‌ని తెచ్చిపెట్టిన చిత్రం ఇదే. వెంకట్‌ (ప్రభాస్‌), శైలు (త్రిష) ప్రేమకథకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రభాస్‌–గోపీచంద్‌ మధ్య వచ్చేపోరాట సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. కాగా 25 ఏళ్ల తర్వాత ‘వర్షం’ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 23న 4కే వెర్షన్‌లో ఈ సినిమా విడుదలవుతోంది.  

మళ్లీ ఖలేజా... 
హీరో మహేశ్‌బాబు ఖలేజా చూపించనున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు, అనుష్క జోడీగా నటించిన చిత్రం ‘ఖలేజా’. రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సునీల్, అలీ, తనికెళ్ల భరణి, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్‌ కీలకపాత్రలుపోషించారు. ఎస్‌. సత్యరామ్మూర్తి సమర్పణలో సింగనమల రమేశ్‌బాబు, సి. కల్యాణ్‌ నిర్మించిన ఈ చిత్రం 2010 అక్టోబరు 7న విడుదలైంది. మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ కావడం, మణిశర్మ సంగీతంలోనిపాటలకు మంచి స్పందన రావడం... వంటి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వెండితెర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

కానీ, బుల్లితెర ప్రేక్షకులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ టీవీలో ఈ సినిమాని విరగబడి చూసేవాళ్లు ఉన్నారనడం అతిశయోక్తి కాదేమో. బహుశా.. అందుకేనేమో.... పద్నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాని మరోసారి వెండితెర ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్‌. ఈ నెల 30న ‘ఖలేజా’ రీ రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నారట చిత్రయూనిట్‌. ఈ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి... ప్రచారంలో ఉన్నట్లు ‘ఖలేజా’ ఈ నెల 30న రిలీజ్‌ అవుతుందా? లేదా? అన్నది తెలియాలంటే మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాలి.  

బాహుబలి రిటర్న్స్‌
ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘బాహుబలి’. అనుష్కా శెట్టి, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్‌ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించారు. ఈ చిత్రం తొలిభాగం ‘బాహుబలి: ది బిగినింగ్‌’ 2015 జూలై 10న విడుదల కాగా, రెండోభాగం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ 2017 ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ రెండు చిత్రాలూ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. కాగా ఈ ఏడాది అక్టోబరులో ‘బాహుబలి’ సినిమాను రీ రిలీజ్‌ చేయనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ అధికారికంగా ప్రకటించారు. అదికూడా కేవలం ఇండియాలోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా రీ రిలీజ్‌ చేయనున్నారు. అయితే రీ రిలీజ్‌లో కొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ఉంటాయని ఆయన చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉంటే విడుదల తేదీపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.  

అతడొస్తున్నాడు
మహేశ్‌బాబు కెరీర్‌లో హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘అతడు’ ఒకటి. మహేశ్‌బాబు, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రమిది. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, నాజర్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం వంటి వారు కీలకపాత్రలుపోషించారు. దుగ్గిరాల కిశోర్, రామ్మోహన్‌ నిర్మించిన ఈ చిత్రం 2005 ఆగస్టు 10న విడుదలై, హిట్‌గా నిలిచింది. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్‌ కానుంది. అది కూడా మహేశ్‌బాబు బర్త్‌డే కానుకగా. ఆగస్టు 9న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అతడు’ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. అంతేకాదు... ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్‌ వెర్షన్‌లోకి మార్చి 4కె, డాల్బీ అట్మాస్‌ టెక్నాలజీతో రిలీజ్‌ చేయబోతున్నారు. ఇలా రీ రిలీజ్‌ విషయంలోనూ మహేశ్‌బాబు సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ చేయబోతున్నారు.  – డేరంగుల జగన్‌ మోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement