హీరో రవితేజ ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు చేశాడు. ఇప్పుడు మాత్రం ఏదో చేస్తున్నాడంటే చేస్తున్నాడంతే అనేలా పరిస్థితి తయారైంది. గత మూడు నాలుగేళ్లలో 'క్రాక్', 'ధమాకా' లాంటి ఒకటి రెండు మూవీస్ మాత్రమే హిట్ అయ్యాయి. మిగిలినవన్నీ ఫ్లాప్ అవడంతో పాటు నష్టాల్ని మిగిల్చాయి. ప్రస్తుతం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే మూవీ చేతిలో ఉంది. దీనికోసం రవితేజ భారీ త్యాగాలే చేశాడు. తాజాగా ఆ విషయాల్ని దర్శకనిర్మాత బయటపెట్టారు.
దర్శకుడు కిశోర్ తిరుమల తీసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా ఇది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్.. ఈసారి రవితేజ హిట్ కొడతాడేమో అనిపించేలా ఉన్నాయి. అందుకు తగ్గట్లే సినిమాలో నటించడంతో పాటు కెరీర్‌లో ఇప్పటివరకు చేయనటువంటి త్యాగాలని రవితేజ చేశాడు. ఈ మూవీ కోసం అడ్వాన్స్ గానీ రెమ్యునరేషన్ గానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఈ విషయాన్ని నిర్మాత సుధాకర్ తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో బయటపెట్టారు. ఇదే చిత్రం కోసం రవితేజ.. తన 'మాస్ మహారాజా' ట్యాగ్ కూడా పక్కనబెట్టేశారని దర్శకుడు చెప్పాడు.
ఇదంతా చూస్తుంటే రవితేజకు కూడా తన పరిస్థితి అర్థమైనట్లు కనిపిస్తుంది. అందుకే ఇలా త్యాగాలు చేస్తున్నాడా అని సందేహం వస్తోంది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఇవన్నీ సినిమాని హిట్ చేస్తాయా అనేది చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా ప్రేక్షకుడు, కంటెంట్ చూసే థియేటర్‌కి వెళ్తున్నాడు. చిన్న సినిమానా పెద్ద సినిమానా.. చిన్న హీరోనా పెద్ద హీరోనా అని అస్సలు ఆలోచించట్లేదు. వరస ఫ్లాప్స్ వల్ల రవితేజ మార్కెట్ ఇప్పటికే బాగా దెబ్బతింది. అందుకే రెమ్యునరేషన్ తీసుకోకుండా సంక్రాంతికి తన సినిమాని రిలీజ్ చేయమని నిర్మాతని కోరాడు. అందుకు తగ్గట్లే జనవరి 13న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈసారి హిట్ పడితేనే రవితేజకు కెరీర్ పరంగా ప్లస్ అవుతుంది. లేదంటే మాత్రం పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది.


