
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు జనాలు ఎగబడిపోతున్నారు. కుదిరితే సెల్ఫీలు దిగుతున్నారు. లేదంటే తమ కెమెరాల్లో వారి ఫోటోలు, వీడియోలు తీసేందుకు తెగ పరితపించిపోతున్నారు. సమయం, సందర్భం కూడా లెక్క చేయకపోవడం శోచనీయం. హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) ఇటీవల మహాకుంభమేళాకు వెళ్లి స్నానమాచరించింది.
కత్రినా పవిత్ర స్నానం చేస్తుండగా వీడియో..
అయితే ఆమె కనబడగానే అందరు ఆమె చుట్టూ మూగారు. వీఐపీ ఘాట్ వద్ద పవిత్రస్నానం చేస్తుంటే వెంటనే ఫోన్లు తీసి వీడియోలు చిత్రీకరించడం మొదలుపెట్టారు. తనకంటూ ప్రైవసీ ఇవ్వకుండా చుట్టూ నిలబడి కత్రినాను తమ ఫోన్లలో చిత్రికరించారు. ఓ వ్యక్తి అయితే.. నేను, నా సోదరుడుతో పాటు ఎవరున్నారో చూడండి అంటూ కత్రినా కైఫ్ పవిత్ర స్నానం చేస్తుండగా ఆమెను తన వీడియోలో చూపించాడు. కుంభమేళా దర్శనాన్ని కత్రినా దర్శనంగా మార్చేశామని ఏదో గొప్ప పని చేసినట్లుగా తెగ నవ్వుతున్నారు.
నవ్వులాటగా ఉందా?
ఈ వీడియోపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె కూడా మనిషేనని, తనను ఎందుకలా వేధిస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. ఇదేమీ సరదాగా లేదని ఫైర్ అవుతున్నారు. నటి రవీనా టండన్ (Raveena Tandon) సైతం దీనిపై స్పందించింది. ఇది చాలా అసహ్యకరంగా ఉంది. ఎంతో ప్రశాంతంగా, అర్థవంతంగా చేసుకునే పనుల్ని ఇలాంటి జనాలు చెడగొడుతుంటారు అని మండిపడింది.