బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై విధించిన నాన్ కో ఆపరేషన్(సహాయ నిరాకరణ) ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రర్న్ సినీ ఎంప్లాయిస్ యూనియన్(ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) ప్రకటించింది. ఈ విషయాన్ని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీఎన్ తివారీ ప్రకటించారు. సినీ కార్మికుల సంఘాలు, నిర్మాతల మండలి అభ్యర్థన మేరకు రణవీర్ సింగ్‌పై విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. రణ్‌వీర్ లీగల్ నోటీసులు పంపిన అనంతరం అతనిపై నిషేధం తొలగించారు.
మొదట డాన్-3 మూవీ విషయంలో తలెత్తిన వివాదంతో రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం విధించారు. ఫర్హాన్ అక్తర్ 'డాన్ 3' ప్రాజెక్ట్ నుంచి రణ్‌వీర్ సింగ్ అర్ధాంతరంగా తప్పుకోవడంతో వివాదం మొదలైంది. తనపై నిషేధాన్ని తొలగించాలని రణ్‌వీర్ కోరాడని ఫెడరేషన్ ముఖ్య సలహాదారు, ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ వెల్లడించారు. ఈ వివాదంపై డాన్-3 మేకర్స్‌తోనే చర్చించుకోవాలని రణ్‌వీర్‌కు చెప్పామని తెలిపారు. ఈ విషయంలో అతని నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. అయితే రణ్‌వీర్ సింగ్ పంపిన లీగల్ నోటీసుకు చట్టపరమైన మార్గాల ద్వారానే స్పందిస్తామని కూడా ఫెడరేషన్ తెలిపింది.
మరోవైపు ఏ కళాకారుడిపైనా నిషేధం విధించే అధికారం ఫెడరేషన్‌కు లేదని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ముఖ్య సలహాదారు అశోక్ పండిట్ అన్నారు. దయచేసి నిషేధం అనే పదాన్ని ఉపయోగించవద్దని ఆయన మీడియాను కోరారు. ఒక వ్యక్తితో కలిసి పనిచేయవద్దని తన సభ్యులకు కేవలం సలహా మాత్రమే ఇవ్వగలదని తెలిపారు. ఎవరినీ వారి వృత్తిని కొనసాగించకుండా నిరోధించలేదని స్పష్టం చేశారు. రణ్‌వీర్ సింగ్ పంపిన నోటీసును ఫెడరేషన్ న్యాయ బృందం పరిశీలిస్తోందని.. దీనికి న్యాయ మార్గాల ద్వారా స్పందిస్తామని పండిట్ వెల్లడించారు. ఎఫ్‌డబ్ల్యూఐసీఈ చర్చలకు సిద్ధంగా ఉందని.. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి రణ్‌వీర్ సింగ్ కూడా చర్చలో పాల్గొంటారని ఆశిస్తున్నామని తెలిపారు. ఇకనైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో వేచి చూడాల్సిందే.
The Federation of Western India Cine Employees (FWICE) announces withdrawal of non-cooperation directive against Actor Ranveer Singh pic.twitter.com/aYsVPCQq0B
— ANI (@ANI) June 3, 2026


