వాస్తవ ఘటనల ఆధారంగా, రియల్ క్యారెక్టర్స్‌ని స్ఫూర్తిగా తీసుకుని కల్పిత కథతో దర్శకుడు రతన్ రిషి తెరకెక్కిస్తున్న చిత్రం ‘క్వీన్’. 2006–2010 మధ్య కాలం నేపథ్యంలో ఈ చిత్రాన్ని వన్ సర్కిల్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్ యామినీ ఈఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ తండ్రిగా సాయికుమార్, విలన్స్‌గా కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ నటిస్తున్నారు.
ఈ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నట్లు యూనిట్ శనివారం ప్రకటించింది. ‘‘ఒక పవర్‌ఫుల్, స్ట్రాంగ్ క్యారెక్టర్‌లో రమ్యకృష్ణగారు కనిపిస్తారు. ప్రజెంట్ సొసైటీతో ముడిపడి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ లవ్‌స్టోరీని ఈ చిత్రంలో చూపిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. తనికెళ్ల భరణి, నవీన్ బేతిగంటి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: భరత్ .ఎం.


