సినిమా ఒక కథ చెబుతుంది. కానీ కొన్ని సినిమాలు కథ కంటే ముందే చర్చను మొదలుపెడతాయి. ప్రస్తుతం తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో అదే జరుగుతోంది. దర్శకుడు వెట్రిమారన్, హీరో ధనుష్ కాంబినేషన్‌లో మురుగన్ నేపథ్యంతో సినిమా వస్తుందనే ప్రచారం ఒకవైపు.. మరోవైపు త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో అదే దేవుడి మీద పురాణ నేపథ్యంతో భారీ చిత్రం తెరకెక్కుతోందనే వార్తలు మరోవైపు. ఈ రెండు సినిమాలపై అధికారిక కథ బయటకు రాకముందే సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు, భావజాల వర్గాలు, రాజకీయ కార్యకర్తలు తమ తమ తీర్పులు చెప్పేస్తున్నారు.
వెట్రిమారన్ ఏమి చెబుతాడు?
వెట్రిమారన్ ఇప్పటివరకు తీసిన సినిమాలు చూస్తే.. ఆయనకు చరిత్ర, సామాజిక వాస్తవికత, అణగారిన వర్గాల కథలపై ప్రత్యేక ఆసక్తి ఉందని తెలుస్తుంది. ఇప్పుడు మురుగన్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుందనే ప్రచారం రావడంతో.. "దేవుడిగా కాదు.. చారిత్రక తమిళ నాయకుడిగా చూపిస్తారా?" అనే చర్చ మొదలైంది. ఈ వాదనకు కవి అరివుమతి రచించిన తమిళ మురుగన్ పుస్తకాన్ని కొందరు జోడిస్తున్నారు. అయితే ఇదే సినిమా కథ అని చిత్రబృందం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అందువల్ల ప్రస్తుతం వినిపిస్తున్నవి ఊహాగానాలు, సోషల్ మీడియా చర్చలుగానే చూడాలి.
త్రివిక్రమ్ ఏమి చెబుతాడు?
త్రివిక్రమ్ సినిమాల్లో పురాణాలు, ఉపనిషత్తులు, గీత, భారతీయ తాత్వికత తరచూ కనిపిస్తుంటాయి. అందుకే ఎన్టీఆర్‌తో ఆయన రూపొందిస్తున్న చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. "ఇది పూర్తిస్థాయి పౌరాణిక చిత్రమా? లేక పురాణ స్ఫూర్తితో సరికొత్త కథనా?" అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం సినిమా విడుదల కాకముందే దానికి ఒక భావజాలాన్ని అంటగట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో సి(మి)నీ యుద్ధం
ఈ రెండు సినిమాల చుట్టూ జరుగుతున్న చర్చ క్రమంగా దర్శకుల నుంచి అభిమానుల మధ్య పోటీగా మారింది. "ధనుష్ గొప్ప నటుడు.. కానీ పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్‌కు సాటి లేడు" అంటూ తెలుగు అభిమానులు పోస్టులు పెడుతుంటే.. "వెట్రిమారన్ చరిత్రను కొత్తగా చెబుతాడు" అంటూ తమిళ అభిమానులు మద్దతు ఇస్తున్నారు. మీమ్స్, ట్రోల్స్, ఎక్స్ పోస్టులు, యూట్యూబ్ డిబేట్లతో ఈ చర్చ మరింత వేడెక్కుతోంది. అయితే ఇందులో ఒక ఆసక్తికర అంశం ఉంది. సినిమా గురించి అధికారిక సమాచారం కంటే.. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలే చర్చను ముందుకు నడిపిస్తున్నాయి.
దర్శకుల పోరా? భావజాలాల పోరా?
ఈ వివాదాన్ని కేవలం రెండు సినిమాల మధ్య పోటీగా చూడలేం. దక్షిణ భారత రాజకీయ, సాంస్కృతిక చరిత్రలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రెండు దృక్పథాల ప్రతిబింబంగా కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు ద్రావిడ ఉద్యమ ప్రభావంతో పురాణాలను చారిత్రక, సామాజిక కోణంలో చదవాలనే వాదన ఉంది. మరోవైపు హిందూ సంప్రదాయాలు, పురాణాలు కోట్లాది మంది విశ్వాసాలకు ప్రతీకలని, వాటిని కొత్త వ్యాఖ్యానాల పేరుతో మార్చి చూపించడం సరికాదని మరో వర్గం భావిస్తోంది. ఈ నేపథ్యమే ఇప్పుడు వెట్రిమారన్, త్రివిక్రమ్ సినిమాల చుట్టూ కూడా ప్రతిబింబిస్తున్నట్లు కనిపిస్తోంది.
దర్శకులు వేరు.. సినిమా భాష వేరు
వెట్రిమారన్ కెమెరా సమాజాన్ని ప్రశ్నిస్తుంది. ఆయన పాత్రలు వ్యవస్థను ఢీకొంటాయి. చరిత్రలో దాచిన కోణాలను వెలికితీయాలనే ప్రయత్నం కనిపిస్తుంది. త్రివిక్రమ్ కథల్లో మాత్రం పురాణ ప్రతీకలు, తాత్విక సంభాషణలు, కుటుంబ విలువలు, ధర్మం-అధర్మం మధ్య సంఘర్షణ ఎక్కువగా కనిపిస్తాయి. ఇద్దరూ గొప్ప కథకులే. కానీ వారి కథనం, దృష్టికోణం పూర్తిగా భిన్నం.
తొందరపాటు సరైందేనా?
భారతీయ సినిమా చరిత్రలో ఇది కొత్త కాదు. పద్మావత్, ఆదిపురుష్, పీకే, ఓ మై గాడ్, ది కేరళ స్టోరీ వంటి అనేక చిత్రాలు విడుదలకు ముందే పెద్ద వివాదాలకు కేంద్రంగా నిలిచాయి. కొన్ని సినిమాలు విడుదల తర్వాత విమర్శలను ఎదుర్కొన్నాయి. మరికొన్ని ప్రారంభ ప్రచారానికి భిన్నంగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందుకే ఇంకా కథ బయటకు రాకముందే వెట్రిమారన్ సినిమాపైనా, త్రివిక్రమ్ సినిమాపైనా తుది తీర్పు ఇవ్వడం తొందరపాటు అవుతుంది.


