చెక్ బౌన్స్ కేసు కారణంగా కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ పేరు కొంతకాలంగా వార్తల్లో నానుతూ వస్తోంది. ఇటీవలే తీహార్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన అతడు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అందులో వ్లాగ్స్, కామెడీ, మినీ సిరీస్.. ఇలా ఏదో ఒకటి చేస్తూ అందరికీ వినోదాన్ని పంచుతానన్నాడు.
విద్య కారణం కాదు
ఇకపోతే అతడికి చదువు రాకపోవడం వల్లే ఇలా కేసులో చికుక్కున్నాడని మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ ఇటీవల వ్యాఖ్యానించాడు. అతడు మంచివాడే కానీ, పెద్దగా చదువుకోకపోవడం వల్లే ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని సానుభూతి చూపించాడు. ఈ వ్యాఖ్యలపై రాజ్‌పాల్ యాదవ్ తాజాగా స్పందించాడు. తనకు చదువు రాదని ఎవరు చెప్పారని ప్రశ్నించాడు. కొన్ని సమస్యలకు చదువు సంద్య కారణం కాదు. నేను చదువుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందనడం కరెక్ట్ కాదు.
కొన్నిసార్లు తప్పవు
నేను బాగానే చదువుకున్నాను. ఇప్పుడు నాకు 55 ఏళ్లు. 11 ఏళ్ల వయసులోనే పని చేయడం మొదలుపెట్టాను. నేను చదువురాని వాడినైతే ఇండస్ట్రీలో 30 ఏళ్లుగా కొనసాగేవాడినే కాదు. ఇక్కడ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఒకానొక సందర్భంలో సమస్యల్లో చిక్కుకుంటారు. దానికి చదువుతో సంబంధమే లేదు అని చెప్పాడు. అదే సమయంలో ప్రియదర్శన్ అలా అన్నందుకు తనపై ఎటువంటి కోపం లేదన్నాడు.
నీ కొడుకులాంటివాడిని
ఇంకా మాట్లాడుతూ.. నా జీవితంలో ముగ్గురు దర్శకులకు ప్రత్యేక స్థానం. రామ్ గోపాల్ వర్మ, డేవిడ్ ధావన్, ప్రియదర్శన్.. వీరిపై నాకు అపారమైన గౌరవం. కేవలం ఈ ముగ్గురి డైరెక్షన్‌లోనే దాదాపు 50 సినిమాలు చేసుంటాను. ప్రియదర్శన్‌కైతే నేనొక కొడుకులాంటివాడిని. కాకపోతే ఆయనకు పూర్తి విషయం తెలీదు.
సినిమా
కాబట్టి ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పని లేదు అని వివరణ ఇచ్చాడు. ఇకపోతే రాజ్‌పాల్ యాదవ్ ప్రస్తుతం భూత్ బంగ్లా సినిమా చేస్తున్నాడు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రాజ్‌పాల్ యాదవ్.. వెల్‌కమ్ టు ద జంగిల్, హైవాన్, మరో రెండు సినిమాలు, రెండు వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడు.


