యుక్త వయసులో ప్రేమలో పడడం సహజం. అదేవిధంగా లవ్‌అట్ ఫస్ట్ సైట్ అనేది జరుగుతుంది. నటి మోహిని గుర్తుందా 90 ప్రాంతంలో దక్షిణాదిలో ప్రముఖ కథానాయకిగా వెలిగారు. అప్పట్లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో నటించి బహుభాషా నటిగా రాణించారు. 1987లో కూత్తు పుళక్కంగళ్ అనే చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసిన ఈమె ఆ తరువాత ఈరమాన రోజావే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. అలా పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తెలుగులోనూ ఆదిత్య 367 చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. అలా మామా బాగున్నావా చిత్రాల్లో నటించారు. 2011 వరకు నటించిన మోహిని భరత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయ్యారు.
అయితే అప్పుడప్పుడు సామాజిక మాద్యమాల్లో పోస్ట్‌లు పెడుతూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ భామ పేర్కొంటూ తనకు సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ అంటే చాలా అభిమానం అన్నారు. హిందూ మతానికి చెందిన ఆయన ఆ తరువాత ఇస్లామ్ మతానికి మారినట్లు గుర్తు చేశారు. అప్పుడు తాను చాలా బాధ పడ్డానన్నారు. అయితే రెహ్మాన్ హిందువుగా ఉన్నప్పుడు ఆయన్ని తాను చాలా ఇష్టపడ్డానని తెలిపారు. ఆయన అదే మతంలో కొనసాగుంటే తన తల్లిదండ్రులను ఒప్పించి ఆయన్నే పెళ్లి చేసుకోవాలన్నంత ఆశ కలిగిందన్నారు.
ఏఆర్.రెహ్మాన్ ప్రస్తుతం పలు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉన్నారు. ఈయన హిందీలో తెరకెక్కుతున్న రామాయణ 1, 2 చిత్రాలకు ప్రఖ్యాత సంగీత దర్శకుడు హన్స్ జిమ్మీర్‌తో కలిసి పనిచేస్తున్నారన్నది గమనార్హం. ఏఆర్.రెహ్మాన్ మూన్‌వాక్ అనే చిత్రానికి సంగీతాన్ని అందించడంతోపాటు పూర్తి స్థాయి పాత్రలో నటించడం విశేషం. ఇందులో ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇకపోతే రెహ్మాన్ గురించి మోహిని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


