
చిత్రాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చిందంటే ఆ చిత్రాలను 12 ఏళ్ల లోపు పిల్లలు చూడడానికి థియేటర్లో అనుమతించరాదని అర్థం అనే విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనలను ఇప్పుడు పెద్దగా ఏ సినిమా థియేటర్ నిర్వాహకులు పాటించడం లేదన్నది వేరే విషయం. సాధారణంగా క్రైమ్, థ్రిల్లర్, హర్రర్ కథా చిత్రాలకు, హింసాత్మక సంఘటనలు అధికంగా ఉన్న చిత్రాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇస్తుంది. అదే సర్టిఫికెట్‌ను ఇప్పుడు రజనీకాంత్ తాజాగా కథానాయకుడు నటించిన కూలీ చిత్రానికి ఇవ్వడం గమనార్హం.
లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర, ,క్రేజీ స్టార్ శ్రుతిహాసన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇక అదనపు ఆకర్షణగా పూజాహెగ్డే ఐటమ్ సాంగ్ ఉండనే ఉంది. కాగా అనిరుద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో కూలీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్‌ను ఇవ్వడం చర్చనీయంగా మారింది. కారణం ఈ చిత్రంలో భారీగా హింసాత్మక సన్నివేశాలు చోటు చేసుకోవడమే అని తెలిసింది. రజనీకాంత్ నటించిన అత్యధిక చిత్రాలు యూ /ఏ సర్టిఫికెట్ తోనే విడుదలయ్యాయి. అయితే 1982లో నటించిన పుదుకవితై, రంగా, 1985లో నటించిన ఊరుక్కావాలన్, 1989లో నటించిన శివ చిత్రాలు మాత్రం ఏ సర్టిఫికెట్‌తో విడుదలయ్యాయి. ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత మళ్లీ కూలీ చిత్రం ఏ సర్టిఫికెట్తో తెరపైకి రాబోతుందన్నది గమనార్హం. అయితే ఈ చిత్ర ట్రైలర్ ,ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని నెహ్రూ హిందూ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించారు.