
ఆర్థిక మోసం కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు(ఎల్‌వోసీ) జారీ చేసిన విషయం తెలిసిందే. ఓ వ్యాపారవేత్త నుంచి రూ.60 కోట్లు తీసుకుని మోసం చేసిన కేసులో ఈ జంట నిందితులుగా ఉంది. దీంతో ఆర్థిక నేరాల విభాగం (EOW) ఈ దంపతులకు లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఈ విషయంలోనే ఈ జంట ముంబై కోర్టును ఆశ్రయించింది.
తమపై ఉన్న లుకౌట్ నోటీసులు రద్దు చేయాలని ముంబై హైకోర్టును శిల్పాశెట్టి దంపతులు ఆశ్రయించారు. ఈమేరకు వారి తరఫున ఒక పిటిషన్ దాఖలు అయింది. ఈ క్రమంలో వారి లాయర్ ఇలా చెప్పారు. రాజ్‌కుంద్రా ఒక వ్యాపారవేత్త అని.., శిల్పాశెట్టి సినీ నటి కావడంతో ఇరువురు తరచుగా విదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఆమె తన వృత్తిపరమైన పనుల కోసం నిత్యం ప్రయాణించాల్సి ఉంటుందని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. వారిద్దరూ కేవలం నిందితులు మాత్రమేనని వారు తమ వ్యాపారం, వృత్తిని కొనసాగించే ప్రాథమిక హక్కును కలిగి ఉన్నారని న్యాయస్థానానికి తెలిపారు.
లుకౌట్ నోటీసుల పేరుతో వారి అవకాశాలను దూరం చేయడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. జనవరి 2026 వరకు లుకౌట్ నోటీసుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే, వారి అభ్యర్తనను న్యాయస్థానం పరిశీలనలోకి తీసుకుంది. దీంతో వారికి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి రావచ్చని తెలుస్తోంది.