
టాలీవుడ్ లెజెండ్, లయన్ చిత్రాల్లో మెప్పించిన నటి రాధికా ఆప్టే. తెలుగులో రక్త చరిత్ర మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందే బాలీవుడ్ సినిమాతో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ పలు సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. బాలీవుడ్తో పాటు తమిళం, మరాఠీ, బెంగాలీ సినిమాల్లో మెప్పించింది. చివరిసారిగా సిస్టర్ మిడ్నైట్ చిత్రంలో కనిపించింది.
అయితే రాధికా ఆప్టే లండన్కు చెందిన మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్ను 2012లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉండే రాధికా.. పెళ్లయిన పదేళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ ప్రకటించింది. గతేడాది డిసెంబర్లో బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా నేహా ధూపియా నిర్వహిస్తోన్న ఫ్రీడమ్ టు ఫీడ్ లైవ్ సెషన్కు హాజరైన ముద్దుగుమ్మ.. తాను గర్భం ధరించాక ఎదురైన అనుభవాలను పంచుకుంది.
మొదటి ట్రైమిస్టర్లో సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సంఘటనలను పంచుకుంది. గర్భంతో ఉన్నప్పటికీ సెట్లో ఎలాంటి సానుభూతి చూపలేదని బాధను వ్యక్తం చేసింది. మొదటి మూడు నెలల్లో తను అనుభవించిన భావోద్వేగం, గందరగోళం, నిరాశ లాంటి ఫీలింగ్స్ వచ్చాయని తెలిపింది. ఆ సమయంలో ఓ నిర్మాత తనతో వ్యవహరించిన తీరుతో చాలా ఇబ్బంది పడ్డానని వివరించింది.
రాధికా ఆప్టే మాట్లాడుతూ..' ఆ నిర్మాతకు నేను గర్భం ధరించడం ఇష్టం లేదనుకుంటా. నాకు చాలా అసౌకర్యం , ఇబ్బందిగా ఉందని చెప్పినా బిగుతుగా ఉండే దుస్తులు ధరించాలని పట్టుబట్టాడు. నా మొదటి త్రైమాసికంలో నేను కాస్తా ఎక్కువగానే తింటున్నా. అప్పుడు నా శరీరంలో విపరీతమైన మార్పులొచ్చాయి. కానీ నా పరిస్థితిని అర్థం చేసుకోకపోవడంతో అసహనానికి గురయ్యా. అదే షూటింగ్ సెట్‌లో నొప్పితో పాటు అసౌకర్యంగా ఉన్నప్పుడు వైద్యుడిని కలిసేందుకు కూడా నన్ను అనుమతించలేదు. అది నన్ను చాలా నిరుత్సాహపరిచింది. వృత్తిపరంగా నిబద్ధతగానే ఉండాలని తెలుసు. ఆ విషయాన్ని ఎల్లప్పుడు గౌరవిస్తా. కానీ ఇలాంటి టైమ్లో కొంచెం సానుభూతి కూడా అవసరం' అని తన బాధను పంచుకుంది.