
రామాయణం మానవ జీవితానికి అవసరమైన విలువలను, మార్గదర్శకత్వాన్ని అందించే ఒక గొప్ప గ్రంథం. మన రాముడి గురించి 'రామాయణ' సినిమా ద్వారా ప్రపంచానికి బాలీవుడ్ చూపనుంది. తాజాగా విడుదలైన గ్లింప్స్ విజువల్స్ అద్బుతంగా ఉన్నాయంటూ గ్రాఫిక్స్ వర్క్‌పై ప్రశంసలు అందుతున్నాయి. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రాల బడ్జెట్ గురించి నమిత్ మల్హోత్రా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
రూ. 4 వేల కోట్ల బడ్జెట్
ఇటీవల జరిగిన పాడ్‌కాస్ట్‌లో, నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. రామాయణంలోని రెండు భాగాలకు దాదాపు $500 మిలియన్లు, అంటే దాదాపు రూ. 4000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దీంతో రామాయణం అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు విడుదలైన భారతీయ చిత్రాల బడ్జెట్‌లు ఏవీ 1000 కోట్లు దాటలేదు. ఈ బడ్జెట్‌తో రామాయణం ప్రపంచ సినిమాల్లో అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీలలో ఒకటిగా కూడా మారనుంది. ఇప్పటివరకు ఈ చిత్రాల బడ్జెట్ రూ. 1500 కోట్ల వరకు ఉంటుందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు నిర్మాత చెప్పిన లెక్కలు చూస్తుంటే కళ్లు చెదిరేలా ఈ మూవీ ఉండబోతుందని అర్థం అవుతుంది.
"పార్ట్ 1, పార్ట్ 2 రెండు సినిమాలు కలిపి పూర్తయ్యే సమయానికి ఇది దాదాపు $500 మిలియన్లు అవుతుంది, అంటే దాదాపు రూ. 4000 కోట్లు. ప్రపంచం చూడవలసిన గొప్ప కథ రామాయణం. మేము ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నాము. అయితే, ఇది ఇప్పటికీ కొన్ని హాలీవుడ్ చిత్రాల బడ్జెట్ల కంటే తక్కువేనని నేను భావిస్తున్నాను. తక్కువ ఖర్చుతో పెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నామని నేను భావిస్తున్నాను. ఈ చిత్రం కేవలం డబ్బు కోసమే చేస్తుంది కాదు. ప్రపంచానికి మన రాముడి గురించి చెప్పాలని అనుకున్నాను.' అని నమిత్ అన్నారు.
20కి పైగా భాషలు
హాలీవుడ్‌లోని ఇతర సినిమాల మాదిరిగానే రామాయణం కూడా ప్రపంచవ్యాప్తంగా సుమారు 20కి పైగా భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని DC కామిక్స్ హిట్ చిత్రాలు బ్యాట్‌మన్, సూపర్ మెన్, వండర్ వుమన్ వంటి వాటితో పాటు మార్వెల్ సినిమాలకు తగ్గకుండా రామాయణ ప్రాజెక్ట్ రూపొందించాలని మేకర్స్ యోచిస్తున్నారు. మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుంది. రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది.