నాతో రెండో సినిమా చేయడానికి హీరోలు ఇష్టపడరేమో

Producer Bunny Vasu About Movies OTT Release - Sakshi

‘‘కౌశిక్‌ ‘చావు కబురు చల్లగా’ పాయింట్‌ చెప్పినప్పుడు ప్రేక్షకులకు నచ్చుతుందా? అనిపించింది. పూర్తి కథ విన్నాక రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా ఉంది.. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ముందుకెళ్లాం’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. కార్తికేయ, లావణ్యా త్రిపాఠీ జంటగా కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌పై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘బన్నీ’ వాసు విలేకరులతో చెప్పిన విశేషాలు.

‘చావు కబురు చల్లగా’ని వైష్ణవ్‌ తేజ్‌తో చేద్దామనుకున్నాను. అయితే ‘ఉప్పెన’ పూర్తయ్యే వరకు ఏ కమిట్‌మెంట్‌ పెట్టుకోలేనని సున్నితంగా చెప్పాడు.. నిజమే కదా అనిపించింది. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయని తీసుకుంటే బాగుంటుందని కౌశిక్‌ చెప్పాడు. ‘ఈ సినిమాకి ఎంత సమయం పడుతుందో తెలియదు.. పూర్తయ్యే వరకు వేరే కమిట్‌మెంట్‌ పెట్టుకోకూడదు?’ అని కార్తికేయతో చెబితే, సరే అన్నాడు. నా సినిమాలు పూర్తవడానికి ఏడాది, అంతకు మించి సమయం పడుతుంటుంది. సినిమా పూర్తయ్యాక ఫస్ట్‌ కాపీ చూసి, ఎక్కడైనా సరిగ్గా రాలేదనిపిస్తే మళ్లీ షూట్‌ చేస్తాం. ‘చావు కబురు చల్లగా’కి గుమ్మడికాయ కొట్టినా, మళ్లీ మూడు రోజులు షూటింగ్‌ చేశాం. ‘గీత గోవిందం’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ సినిమాలకు కూడా ఏడాదికి పైగానే పట్టింది. అన్ని రోజుల పాటు విజయ్‌ దేవరకొండ, అఖిల్‌ వేరే సినిమా చేయలేదు. అందుకే నాతో రెండో సినిమా చేయడానికి హీరోలు ఇష్టపడరేమో (నవ్వుతూ).

క్లాస్‌ స్టోరీని మాస్‌ ప్రేక్షకులకు కూడా చేరువయ్యేలా ఎలా తీయాలని ఆలోచిస్తా. పాయింట్‌ క్లాస్‌గానే ఉంటుంది. కానీ ట్రీట్‌మెంట్‌ మాత్రం యూనివర్సల్‌గా ఉంటుంది. అదే నా విజయ రహస్యం. సినిమాలను డైరెక్టుగా ఓటీటీల్లో రిలీజ్‌ చేయడం వల్ల నిర్మాతలకు ఒకేసారి డబ్బు వస్తుంది కానీ పెద్దగా లాభం ఉండదు. థియేటర్లో విడుదల చేస్తే.. హిట్‌ టాక్‌ వచ్చిందంటే కలెక్షన్లు పెరుగుతాయి. ఆ లాభాలన్నీ నిర్మాతలకే వస్తాయి.

కరోనా సమయంలో ఓటీటీలకు కంటెంట్‌ బాగా అవసరం కావడంతో ఎక్కువ డబ్బు ఇచ్చి సినిమాలు కొన్నారు. కానీ, ఇప్పుడు తక్కువ ధరకే అడుగుతున్నారు. సినిమాని థియేటర్లో విడుదల చేసిన 50రోజుల (చిన్న చిత్రాలు) నుంచి 75 రోజు (పెద్ద చిత్రాలు)లకు కానీ ఓటీటీకి ఇవ్వకూడదు. రిలీజైన రెండు వారాలకే ఓటీటీలో వస్తే ప్రేక్షకులు థియేటర్లకు రారు. ఓటీటీ వ్యాపారం కూడా తక్కువగా ఉంటుంది. అప్పుడు హీరోల స్టార్‌డమ్‌ కూడా పడిపోతుంది. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ వల్ల నిర్మాతలకు, హీరోలకూ నష్టమే తప్ప లాభం ఉండదు. 

చదవండి: ప్రకాశ్‌రాజ్‌తో నటించాలంటే భయం: ఆమని

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top