పెద్ద పెద్ద డైలాగ్స్‌ రాత్రిళ్లు బట్టీపట్టేదాన్ని: ఆమని

Aamani as Gangamma in Chavu Kaburu Challaga - Sakshi

‘‘ఇన్నేళ్ల నా సినీ కెరీర్‌లో ఏ సినిమాకూ ముందు రోజు స్క్రిప్ట్‌ తీసుకెళ్లి డైలాగులు నేర్చుకున్నది లేదు. ‘చావు కబురు చల్లగా’లో వైజాగ్‌ యాసలో పెద్ద పెద్ద మాస్‌ డైలాగ్స్‌ చెప్పాల్సి రావడంతో రాత్రిళ్లు బట్టీపట్టి ఉదయం షూటింగ్‌లో పాల్గొనేదాన్ని. ఈ పాత్ర ఛాలెంజింగ్‌గా అనిపించింది’’ అని నటి ఆమని అన్నారు. కార్తికేయ, లావణ్యా త్రిపాఠీ జంటగా కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం 19న విడుదలవుతోంది.

ఈ చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటించిన ఆమని మాట్లాడుతూ– ‘‘అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమా చేస్తున్నప్పుడు ‘చావు కబురు చల్లగా’లో నటించమని బన్నీ వాసు అనడంతో కథ, నా పాత్ర ఏంటని అడగకుండా ఒప్పుకున్నా. ఇందులోని సన్నివేశాలు చూస్తే కౌశిక్‌ అనుభవం ఉన్న దర్శకునిలా తీశాడు. నేను ఎంతోమందితో నటించా. కానీ ప్రకాశ్‌రాజ్‌గారితో నటించడం భయం. ఆయన ఎంత పెద్ద డైలాగ్‌ అయినా ఒకే ఒక్క టేక్‌లో చేస్తారు. ఆయనతో నటించేటప్పుడు నాకు రెండో టేక్‌ తీసుకోవాలంటే భయం. విలన్‌ పాత్ర చేయాలన్నది నా కల. నేను హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఇప్పుడు నటీనటులకు ఉన్నన్ని సౌకర్యాలు లేవు. అప్పుట్లో షాట్‌ గ్యాప్‌లో చెట్లకింద కూర్చుని సరదాగా మాట్లాడుకునేవాళ్లం. దీంతో నటీనటుల మధ్య బాండింగ్‌ బాగుండేది. ఇప్పుడు షాట్‌ గ్యాప్‌ వస్తే క్యారవాన్‌లోకి వెళ్లిపోతున్నారు. లేకుంటే మొబైల్స్‌తో బిజీ అయిపోతున్నారు’’ అన్నారు.

చదవండి: ఆ అభినందనలను ఎప్పటికీ మర్చిపోలేను: రాజేంద్ర ప్రసాద్‌ 

శుభలగ్నం మేడమ్‌ అని పలకరిస్తుంటారు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top