
‘‘ఓ పెద్ద సినిమా రిలీజ్ అప్పుడు వీకెండ్‌లో టికెట్ ధరలు ఎక్కువ ఉండొచ్చన్నది నా ఉద్దేశం. విదేశాల్లో ఇలానే ఉంటుంది. కానీ మనోళ్లు ఫిక్స్ చేస్తే... వారమంతా ఒకటే రేట్ ఉంటుంది. వీక్ డేస్‌లో మామూలు ధరలు ఉంచి, వీకెండ్‌లో ధరలు పెంచుకునే సౌకర్యం ఉండాలి. అప్పుడు సినిమా టికెట్లు అందరికీ అందుబాటులో ఉంటాయి. ‘భారతీయుడు’ సినిమా సమయంలో కలెక్టర్స్‌ను రిక్వెస్ట్ చేసి, హైదరాబాద్, వైజాగ్‌లో టికెట్ ధరలు పెంచాను.
ఇది తెలిసి రామానాయుడుగారు షాక్ అయ్యారు. రత్నం భలే చేశాడన్నారు’’ అని నిర్మాత ఏయం రత్నం అన్నారు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’. జ్యోతికృష్ణ, క్రిష్ దర్శకత్వంలో ఏయం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ రావు నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్పిరిట్ వర్సెస్ స్వార్డ్’ ఈ నెల 24న విడుదల కానుంది.
ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత ఏయం రత్నం చెప్పిన విశేషాలు.
⇒ నా గత చిత్రాలు ‘కర్తవ్యం, భారతీయుడు’ వంటివాటి తరహాలోనే ‘హరిహర వీరమల్లు’లో కూడా వినోదంతోపాటు సందేశం ఉంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కల్పిత కథే ఈ చిత్రం. పవన్ కల్యాణ్‌గారితో ‘ఖుషి, బంగారం’ చిత్రాల తర్వాత నేను చేసిన మూడో సినిమా ఇది.
⇒ సినిమా అనేది అవసరం కాదు. ప్రేక్షకులు ఆ సినిమా పట్ల ఆసక్తిగా ఉంటే థియేటర్స్‌కు వస్తారు. లేక పోతే లేదు. కొందరు ఓటీటీలో చూద్దాంలే అని రావడం లేదు. నా సినిమా బాగుంది... కనీసం పెట్టిన డబ్బులైనా తిరిగి రావాలని, టికెట్ ధరలను పెంచమని ప్రభుత్వానికి విన్నవించుకున్నాను. తెలంగాణ ప్రభుత్వం చారిత్రక సినిమా అయితే ఇస్తామన్నారు. మాది చారిత్రక సినిమాయే అని చె΄్పాం. ఆడియన్స్ మామూలు సినిమా తీస్తే థియేటర్స్‌కు రావడం లేదు.
క్వాలిటీ సినిమా అందించాలంటే నిర్మాణ వ్యయం పెరిగి పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా టికెట్‌నుపావలాకు, అర్ధణాకు అమ్మితే ఎలా వర్కౌట్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో టికెట్ ధరలు తక్కు వగా ఉంటే సినిమా థియేటర్స్ మూసివేయాల్సి వస్తుంది. మన నేటివిటీ ఉన్న ఒకట్రెండు సినిమాలు ఆడొచ్చు. కానీ ఈ సినిమాలే ఉంటే థియేటర్స్ అనేవి ఉండవు. ఓపెనింగ్ తెప్పించే పెద్ద సినిమాల వల్లే థియేటర్స్ ఉంటాయి. అవి ఉంటేనే కదా... చిన్న సినిమాలకు చాన్స్ ఉంటుంది.