ఆ హీరోయిన్‌ బయోపిక్‌లో నటించాలనుంది! | Priyanka Arul Mohan Wants to do This Actress Biography | Sakshi
Sakshi News home page

ఆమె బయోపిక్‌ చేయాలనుంది: గ్యాంగ్‌ లీడర్‌ హీరోయిన్‌

Mar 1 2026 6:57 AM | Updated on Mar 1 2026 6:57 AM

Priyanka Arul Mohan Wants to do This Actress Biography

వివిధ భాషల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది ప్రియాంక మోహన్‌. ఒంద్‌ కథే హెల్లా అనే కన్నడ చిత్రంతో కథానాయికగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిందీ బ్యూటీ. అదే ఏడాది నాని గ్యాంగ్‌ లీడర్‌ సినిమాతో తెలుగువారికీ పరిచయమైంది. ఆ వెంటనే డాక్టర్‌ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. ఇలా తక్కువ కాలంలోనే మూడు భాషల్లో నటించే అవకాశాలను అందుకుని పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ సొంతం చేసుకుంది.

సినిమా
అయితే ఈ బ్యూటీకి 2025 పెద్దగా కలిసి రాలేదు, సరైన హిట్‌ పడలేదు. అంతే కాకుండా ఇప్పుడు తన చేతిలో భారీ ప్రాజెక్టులు కూడా ఏమీ లేవు. ప్రస్తుతం తమిళంలో నటుడు కెవిన్‌ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. కన్నడలో 666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌ అనే చిత్రంలో యాక్ట్‌ చేస్తోంది. మరోవైపు ఈమె ప్రధాన పాత్రలో నటించిన మేడిన్‌ కొరియా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఆమె బయోపిక్‌లో నటించాలనుంది
ఇకపోతే ప్రతి నటికి ఏదో ఒక బయోపిక్‌లో నటించాలనే కోరిక ఉంటుంది. అలాంటి కోరిక మీకు ఏదైనా ఉందా? అన్న ప్రశ్నకు ప్రియాంక ఇలా స్పందించింది. దివంగత నటి సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది. కన్నడ నటి సౌందర్య.. మాతృభాషలో కన్నా తెలుగు, తమిళం భాషల్లోనే స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ అందుకుంది. స్టార్‌ హీరోలందరితోనూ జోడీ కట్టింది. తక్కువకాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. అంతే తక్కువ కాలంలో విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైంది. మరి సౌందర్య బయోపిక్‌ తెరకెక్కిస్తారా? ఒకవేళ తీస్తే ప్రియాంకను హీరోయిన్‌గా తీసుకుంటారా? చూడాలి!

Advertisement
 
Advertisement
Advertisement