
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) సతీమణి, నిర్మాత సుప్రియ మేనన్ వేధింపులకు గురౌతున్నట్లు పేర్కొన్నారు. ఏడేళ్లుగా తనను ఒక మహిళ వేధిస్తున్నట్లు తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఫేక్ సోషల్ మీడియా ఖాతాలను క్రియేట్ చేసుకొని తనను టార్గెట్ చేస్తూ నిత్యం అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నట్లు సుప్రియ తెలిపారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
వేధింపుల గురించి సుప్రియ మీనన్ ఇలా చెప్పారు. '2018 నుంచి ఆన్‌లైన్ ట్రోల్స్, వేధింపులను ఎదుర్కొంటున్నాను. నన్ను లక్ష్యంగా చేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఖాతాలను క్రియేట్ చేసుకున్న ఒక మహిళ పదేపదే నన్ను ట్యాగ్ చేస్తూ వేధిస్తుంది. ఆమె పేరు క్రిస్టినాల్డో. ఆమె నా గురించి చేసిన ప్రతి పోస్టు చాలా అసహ్యకరమైన రీతిలో ఉంటుంది. ఆమె ఖాతను నేను పదేపదే బ్లాక్ చేస్తున్నప్పటికీ మరో కొత్త నకిలీ ఖాతాలను క్రియేట్ చేసి పోస్ట్ చేస్తుంది.

ఆమె ఎవరనేది నాకు చాలా సంవత్సరాల క్రితమే తెలిసింది. కానీ ఆమెకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు కాబట్టి వదిలేశాను. ఇదే అదునుగా తీసుకున్న ఆమె నాపై విషం చిమ్ముతూనే ఉంది. చివరకు మరణించిన నా తండ్రిని లక్ష్యంగా చేసుకుని నీచమైన కామెంట్లు చేయడం ప్రారంభించింది. అందుకే ఆమె గురించి బయటకు చెప్పాల్సి వచ్చింది.' అమెరికాలో నివాసం ఉంటున్న ఆమె ఒక నర్సు అని తెలుస్తోంది. ఆమెపై ఫిర్యాదు చేసేందుకు సుప్రియ ఉన్నట్లు సమాచారం.
సుప్రియా మేనన్ ఒకప్పుడు ఆమె జర్నలిస్టుగా పనిచేసేవారు. పృథ్వీరాజ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. 2011లో పెళ్లి చేసుకున్నారు. అయితే, తన సతీమణి వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చాలాసార్లు పృథ్వీరాజ్ చెప్పారు. వీరికో పాప (అలంకృతా మేనన్) ఉంది. పృథ్వీరాజ్ తండ్రి పరమేశ్వరన్ సుకుమారన్, తల్లి మల్లిక, అన్నయ్య ఇంద్రజిత్, వదిన పూర్ణిమ ఇలా అందరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారే.. అందుకే మలయాళంలో వారి కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది.