టైటిల్ : ప్రేమనే ఊరిలో
నటీనటులు: శ్రీరామ్, రంగయనా రఘు, తపస్విని పూనాచా, రమికా శివు, గోవిందే గౌడ, సువీష్ చంద్ర, అభిషేక్ కల్మణి, అభి మహేష్ తదితరులు
నిర్మాత: మమతా దేవేంద్ర ఎం, సురేష్ కొండేటి
దర్శకత్వం: మనోజ్ కుమార్
సంగీతం: సునాద్ గౌతమ్
సినిమాటోగ్రఫి: రాజ్‌కాంత్ ఎస్‌కే
ఎడిటర్: హర్షిత్ ప్రభు
విడుదల తేది: అక్టోబర్ 2, 2026
కన్నడలో చిన్న చిత్రంగా విడుదలై మంచి విజయం అందుకున్న చిత్రం ‘ప్రేమద ఊరలి’. ఇప్పుడీ చిత్రాన్ని ‘ప్రేమనే ఊరిలో’పేరుతో తెలుగులో ఈ శుక్రవారం(అక్టోబర్ 2) రిలీజ్ చేశారు. మరి ఈ ప్రేమకథా చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
నాగన్న(రంగయాన రఘు) అనే రైతు తన భార్య చనిపోవడంతో కొడుకు సంతోష్(శ్రీరామ్)ని అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. స్కూల్‌కి వెళ్లమంటే వెళ్లకుండా.. నాన్నలాగే సంతోష్ కూడా రైతుగా మారి ఊర్లో వ్యవసాయం చేస్తుంటాడు. అయితే కొడుకుకు ఉన్నత చదువులు చదివిన అమ్మాయిని భార్యగా తీసుకురావాలనుకుంటాడు నాగన్న. ఆ కారణంగానే 30 ఏళ్లు దాటినా సంతోష్‌కి పెళ్లి జరగదు. అదే ఊర్లో మగరాయుడిలా తిరిగే మరదలు వసంత(రమికా శివు).. ఫ్రెండ్ చెప్పిన మాటలు విని సంతోష్‌ని ప్రేమిస్తుంది. తన ప్రేమ విషయం బావకి చెబుదామని వసంత అనుకున్న రోజే.. సంతోష్ సడెన్‌గా రుక్మిణి(తపస్విని పూనాచా)ని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తాడు. అసలు రుక్ష్మిణి ఎవరు? సంతోష్ ఆమెనే పెళ్లి చేసుకోవాలని నాగన్న ఎందుకుపట్టుపడ్డాడు? ఫస్ట్‌నైట్ ముందురోజు సంతోష్‌కి తెలిసిన విషయం ఏంటి? కొడుకు దగ్గర నాగన్న దాచిన నిజం ఏంటి? రుక్మిణి ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయింది? మరదలు వసంతతో సంతోష్ రిలేషన్ ఎలా సాగింది? ఈ ముక్కోణపు ప్రేమకథలో ఎవరి ప్రయాణం ఏ దారికి చేరింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
అనుమానం పెనుభూతం అంటారు. ఒక్కసారి అది మనసులోకి చేరిందంటే.. చిన్న విషయాన్నీ పెద్దదిగా చూపిస్తూ బంధాలను దూరం చేస్తుంది. అదే నమ్మకంతో ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుంటే.. ఎలాంటి రిలేషన్ అయినా ఆనందంగా సాగుతుంది. ‘నమ్మకం అనేది మనసులో ఉండాలి.. వినే చెవుల్లో కాదు’ అని చాటిచెప్పిన చిత్రమే ‘ప్రేమనే ఊరిలో’ . ఎలాంటి రక్తపాతం, యాక్షన్ హంగులు లేకుండా స్వచ్ఛమైన పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. ఈ తరహా కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఇంకా చెప్పాలంటే చాలా పాతకాలపు స్టోరీ. అయినప్పటికీ తెరపై చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కథలోని మెయిన్ పాయింట్.. ఇప్పటి జనరేషన్‌కి చాలా అవసరం అనే ఫీలింగ్ కలుగుతుంది.
దర్శకుడు మనోజ్ కుమార్ పల్లెటూరి నేపథ్యంలో ఓ ముక్కోణపు ప్రేమకథను రాసుకొని..దానికి రకరకాల భావోద్వేగాలను యాడ్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నాగన్న భార్య మరణం సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. కొడుకుపై ప్రేమతో ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉండడం.. పెద్దయ్యాక కొడుకు కూడా నాన్నపై అంతే ప్రేమను పెంచుకోవడం..ఊర్లో వ్యవసాయం.. స్నేహితులతో ఆటలు, మరదలు చేసే అల్లరి పనులతో ఫుల్ ఎంటర్‌టైనింగ్ కథనం సాగిస్తూనే..మరోవైపు రుక్మిణీ జర్నీ చూపించారు. దీంతో ఎలాంటి సంబంధం లేని సంతోష్, రుక్మిణీల ఎలా కలుస్తారు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది.
అంతలోనే మరదలు వసంత.. బావపై మనసు పారేసుకుంటుంది. దీంతో ఈ కథ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మారుతుంది. ఓ ఎమోషనల్ పాయింట్‌తో ఫస్టాఫ్ ముగించి.. సెకండాఫ్‌పై కొంత క్యూరియాసిటీని పెంచేలా చేశాడు. ఇక ద్వితియార్థం చాలా వరకు ఎమోషనల్‌గా సాగుతుంది. నాగన్న సిస్టర్ ఎపిసోడ్ గుండెను బరువెక్కిస్తుంది. రైతుల గురించి రుక్మిణి చెప్పే డైలాగ్ కూడా బాగుంటుంది. చివరి 20 నిమిషాలు మరింత ఎమోషనల్‌గా సాగుతుంది. తండ్రి కొడుకుల ఎమోషన్.. భార్య భర్తల అనుబంధంతో పాటు అంతర్లీనంగా ఆడపిల్లల జీవితాల గురించి ఓ మంచి సందేశం ఇచ్చారు. అయితే ఫస్టాఫ్ కొంత సాగదీతగా అనిపించడంతో పాటు ట్రైయాంగిల్ లవ్‌స్టోరీ కూడా పలు పాత చిత్రాలను గుర్తు చేయడం కొంతవరకు మైనస్. అలాగే తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. సినిమా చూసినవారికి నచ్చుతుందేమో కానీ.. అసలు రిలీజ్ అయిన విషయం వారికి తెలియాలి కదా? ప్రమోషన్స్ గట్టిగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
సినిమాలోని ప్రధాన పాత్రల్లో నటించినవారంతా తమ తమ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్‌ఇచ్చారు. తండ్రి నాగన్న పాత్రలో రఘు ఒదిగిపోయాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగా నటించాడు. ఇక పల్లెటూరి కుర్రాడు సంతోష్ పాత్రకి శ్రీరామ్ న్యాయం చేశాడు.తెరపై హీరోలా కాకుండా..పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. ఇక మగరాయుడిలా తిరిగే పల్లెటూరి యువతి, హీరో మరదలు వసంతగా రమికా శివు తనదైన నటనతో ఆకట్టుకుంది. కొన్ని చోట్ల నవ్విస్తూనే మరికొన్ని చోట్ల కన్నీళ్లను తెప్పించింది. ఇక రుక్మిణి క్యారెక్టర్‌లో తపస్విని ఒదిగిపోయింది. అయితే వీరిలో నాగన్న పాత్ర హైలెట్ అని చెప్పొచ్చు. సాంకేతికంగా సినిమా బాగుంది. మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. నేపథ్య సంగీతం సినిమాలోని సన్నివేశాలను ఎమోషనల్‌గా మలిచింది. సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను తెరపై అద్భుతంగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


