
ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి( Krithi Shetty) జంటగా నటిస్తున్న చిత్రం 'ఎల్‌ఐకే' (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) విడుదలపై ప్రకటన వచ్చేసింది. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో వరుస హిట్లు అందకున్న ప్రదీప రంగనాథన్ ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేశాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాత నయనతార (Nayanthara) ప్రకటించింది. విఘ్నేష్ శివన్( Vignesh Shivan) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ దీనికి స్వరాలు అందిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో 'ఎల్‌ఐకే' చిత్రం తెరకెక్కింది. సెప్టెంబర్ 18న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు నయనతార అధికారికంగా ప్రకటించింది. తమిళ్‌తో పాటు, తెలుగు, కన్నడ, మలయాలంలో తెరకెక్కుతున్నట్లు తెలిపారు. ప్రేమ కోసం మొబైల్ గాడ్జెట్‌ను ఉపయోగించి 2035 వరకు టైమ్ ట్రావెల్ చేసే వ్యక్తి పాత్రలో ప్రదీప్ రంగనాథన్ కనిపించనున్నారు. ఇందులో ఎస్‌జే సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు.

సినిమా బడ్జెట్ భారీగా ఉండటంతో ఐదుగురు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. వారిలో నయనతార ఒకరు కావడం విశేషం. జీవితానికి ఇన్సూరెన్స్ ఉంటుందని అందరికీ తెలుసు. కానీ, ప్రేమకి ఉండే ఇన్సూరెన్స్ గురించి ఈ చిత్రంలో తెలుసుకుంటారని గతంలో దర్శకుడు తెలిపాడు. భవిష్యత్తు నేపథ్యంలో రాసుకున్న కథ కాబట్టి ఖర్చుతో పాటు సమయం కూడా ఎక్కువే పడిందని ఆయన అన్నాడు.