సాక్షి, ఫిలింనగర్(హైదరాబాద్): ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్(Bellamkonda Suresh)పై ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్ రోడ్ నెంబర్–7లో శివప్రసాద్ అనే వ్యక్తికి ఇల్లు ఉండగా కొంతకాలంగా ఆయన ఇంటికి తాళం వేసి తన బంధువుల వద్దకు వెళ్లాడు. మూడు రోజుల క్రితం బెల్లంకొండ సురేష్‌తో పాటు ఆయన అనుచరులు శివప్రసాద్ ఇంటికి వచ్చి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఆస్తులు ధ్వంసం చేసి గోడలు పగులగొట్టి నానా బీభత్సం సృష్టించారు.
ఇంటిని ఆక్రమించుకునేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న శివప్రసాద్ ఇంటికి వచ్చి చూడగా అప్పటికే ఇల్లంతా పూర్తిగా దెబ్బతిని ఉంది. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బెల్లంకొండ సురేష్ 30 మంది అనుచరులతో వచ్చి తన ఇంటిని ధ్వంసం చేశాడని తెలుసుకున్న బాధితుడు తన సిబ్బందిని బెల్లంకొండ సురేష్ ఇంటికి పంపించాడు. ఆగ్రహంతో ఊగిపోయిన సురేష్ సిబ్బందిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దూషణలతో న్యూసెన్స్ చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫిలింనగర్ పోలీసులు బెల్లంకొండ సురేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


