‘పెద్ది’.. క్షమాపణలు చెప్పిన బుచ్చిబాబు | Peddi Director Buchi Babu Apologizes To Women | Sakshi
Sakshi News home page

క్షమించండి.. ఆ సీన్లలో మార్పులు చేస్తాం : ‘పెద్ది’ దర్శకుడు

Jun 6 2026 10:24 AM | Updated on Jun 6 2026 10:51 AM

Peddi Director Buchi Babu Apologizes To Women

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్‌ పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మహిళలను అవమానించేలా జాన్వీ కపూర్‌ పాత్రను తీర్చిదిద్దారంటూ పలువురు నెటిజన్స్‌ బుచ్చిబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలో హీరోయిన్‌ని చూపించిన తీరు, కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు తాజాగా ఈ విమర్శలపై స్పందించాడు. క్షమాపణలు కోరుతూ సోషల్‌ మీడియాలో ఓ సుధీర్గమైన పోస్ట్‌ పెట్టాడు.

ఒక ఫిల్మ్‌ మేకర్‌గా.. సినిమా అనేది ప్రేక్షకులను అలరించాలి, వారిలో స్ఫూర్తిని నింపాలి అనుకుంటాను. ఎవరినీ అసౌకర్యానికి, అగౌరపరచాలని చూడను. పెద్దిలో కొన్ని సన్నివేశాలు ఇబ్బందిగా అనిపించినట్లు మా దృష్టికి వచ్చింది. వాటిని తీవ్రంగా పరిగణించాం. తెరపైన, తెర వెనుక కూడా మహిళలంటే నాకు ఎప్పుడూ అపారమైన గౌరవం ఉంది. మహిళల పాత్రలను అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. ఈ సినిమాలో సన్నివేశాలు మీ మనోభావాలు దెబ్బతీసేలా ఉంటే.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. అలాగే ఆయా సన్నివేశాలలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నాం (జాన్వీ కపూర్‌కి సంబంధించిన రొమాంటిక్‌ సీన్లన్నీ తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం). 

ప్రేక్షకులు ఆదరిస్తేనే సినిమా ఎదుగుతుంది. అభిమానులతో ఉన్న అనుబంధమే సినిమా రంగాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి అభిమానుల భావోద్వేగాలు, అంచనాలను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కొన్ని సున్నితమైన అంశాలపై కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రతి మహిళా గౌరవానికి అర్హురాలే. వారిని శక్తిమంతంగా చూపించడానికి, వారి విలువను పెంచే కథలు చెప్పడానికి మేం కట్టుబడి ఉన్నాం. తమ అభిప్రాయాలను నిజాయితీగా, మనస్ఫూర్తిగా పంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని బుచ్చిబాబు తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement