
పవన్ కల్యాణ్ ఎట్టకేలకు నిజాలు ఒప్పుకొన్నారు. టాలీవుడ్‌లో చాలామంది హీరోల్లో తను ఒకడినే తప్ప పెద్ద గొప్పేం కాదని చెప్పారు. ఇంకా చెప్పాలంటే కొందరు హీరోలతో పోలిస్తే తాను చాలా తక్కువని కూడా అన్నారు. ఈయన నటించిన 'హరిహర వీరమల్లు'.. దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకొంది. ఫైనల్‌గా జూలై 24న అంటే ఈ వీకెండ్ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా పవన్ మీడియా ముందుకొచ్చారు. హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.
(ఇదీ చదవండి: 'వీరమల్లు' నిర్మాతకు కీలక పదవి.. పవన్ కల్యాణ్ ప్రకటన)
ఇందులోనే మాట్లాడిన పవన్.. 'రాజకీయంగా నాకు పేరుండొచ్చు. దేశవ్యాప్తంగా నేను తెలుసుండొచ్చు కానీ సినిమాల పరంగా చూస్తే కొందరు హీరోల కంటే నేను చాలా తక్కువనే. దానికుండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్లకు బిజినెస్ అయినంతగా నాకు బిజినెస్ అవ్వదు. వాళ్లకు వచ్చినంతగా నాకు కలెక్షన్స్ రాకపోవచ్చు. ఎందుకంటే నా దృష్టి ఎప్పుడూ నేను సినిమాలపై పెట్టలేదు' అని చెప్పుకొచ్చారు.
మరో సందర్భంలో మాట్లాడుతూ.. 'నువ్వు చిరంజీవి తమ్ముడైనా, కొడుకైనా.. చివరికి నా కొడుకైనా టాలెంట్ లేకపోతే ఇక్కడ నిలబడలేం' అని ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు. పవన్ చెప్పడం వరకు బాగానే ఉంది కానీ ఆయన అభిమానులకు ఇది చెవికెక్కుతుందా అనేది చూడాలి. ఎందుకంటే మా హీరో స్టార్, సూపర్‌స్టార్ అని ఇతర హీరోల అభిమానులతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు. ఇప్పటికైనా వాళ్లు అర్థం చేసుకుని మారతారా లేదా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: 'ఫిష్ వెంకట్'కు ఎందుకు సాయం చేయాలి: నట్టి కుమార్)