
పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఈ చిత్రాన్ని క్రిష్, జ్యోతికృష్ణ దర్శకులు సంయుక్తంగా తెరకెక్కించారు. ఏఎం రత్నం నిర్మించారు. జులై 24న విడుదల సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ స్పెషల్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. అక్కడ నిర్మాతకు పవన్ కల్యాణ్ బంపరాఫర్ ప్రకటించారు.
నిర్మాత ఏఎం రత్నంను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించనున్నట్లు కొద్దిరోజుల క్రితం నుంచే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే విషయం గురించి పవన్ కల్యాణ్ ఇలా స్పందించారు. 'నాకు ఇష్టమైన నిర్మాత ఏఎం రత్నం. తెలుగు పరిశ్రమకు ఎప్పుడూ అండగా ఉండే వ్యక్తి. ఆయనకు ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. ఈ క్రమంలోనే ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఏఎం రత్నం పేరును ప్రతిపాదించాను. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా చెప్పాను. నా నిర్మాత అని మాత్రమే ఆయనకు ఈ పదవి ఇవ్వడం లేదు. అందరి హీరోలతో సినిమాలు చేశాడు. పాన్ ఇండియాలో కూడా ఏఎం రత్నానికి పరిచయాలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉంటే పరిశ్రమ ఇంకా బాగుంటుంది. నా పరిధిలో ఉన్న శాఖ కాబట్టి ఏఎం రత్నం పేరును ప్రతిపాదించాను. భవిష్యత్లో అవుతుందని ఆశిస్తున్నాను.' అని ఆయన అన్నారు.