‘‘నా యాభై ఏళ్ల సినీ కెరీర్‌లో 500లకు పైగా చిత్రాల్లో నటించాను. కానీ, ‘ది ప్యారడైజ్’లో సికంజా మాలిక్ లాంటి భయంకరమైన క్యారెక్టర్ చేయడం నా లైఫ్‌లో తొలిసారి. శ్రీకాంత్ ఓదెల నన్ను ఇంత భయంకరంగా చూపిస్తాడనుకోలేదు. నా లైఫ్‌లో ఎక్కువ టేకులు తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్. మా గురువు దాసరి నారాయణరావుగారు కూడా చాలా టేకులు తీసుకునేవారు’’ అని నటుడు మంచు మోహన్ బాబు తెలిపారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన సినిమా ‘ది ప్యారడైజ్’. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలైంది.
ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన మీడియా ములాఖత్ కార్యక్రమంలో మోహన్‌బాబు మాట్లాడుతూ–‘‘సుధాకర్ లాంటి నిర్మాత సినిమా పరిశ్రమకు కావాలి. ఈ సినిమాలో నాని పడిన కష్టం ఆ భగవంతుడికే తెలుసు. అయితే ప్రజలు ఆశీర్వదించారు కాబట్టే ‘ప్యారడైజ్’ సూపర్ డూపర్ హిట్ అయింది’’ అని పేర్కొన్నారు.
నాని మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకులకి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ల అభిప్రాయాన్ని చాలా నిజాయితీగా చెబుతారు. అలాంటి ప్రేక్షకులు ఉన్నంతవరకు తెలుగు సినిమా గొప్పగా ఉంటుంది. మోహన్ బాబుగారితో కలిసి పని చేసిన తర్వాత ఆయన ఎంత అద్భుతమైన వ్యక్తో అర్థమైంది’’ అని తెలిపారు. శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నటించిన నటీనటులకు, పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. నాని, నా అనుబంధం ఇక్కడితో ఆగిపోయేది కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘మా టీమ్ అందరూ ఈ రెండు సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు’’ అన్నారు సుధాకర్ చెరుకూరి. ఈ కార్యక్రమంలో నటులు ప్రియదర్శి, సంపూర్ణేష్ బాబు, మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ తదితరులు మాట్లాడారు.


