హీరో నాని.. పక్కా ప్లానింగ్‌తో ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేవాడు. అలాంటి ఇతడి ప్లానింగ్‌ని డిస్ట్రబ్ చేసిన మూవీ 'ప్యారడైజ్'. ఇతడితో గతంలో 'దసరా' మూవీ చేసిన శ్రీకాంత్ ఓదెల దీనికి దర్శకుడు. ఇప్పటికే మార్చి, ఆగస్టులో వస్తుందని చెప్పి వాయిదాలు వేశారు. ఈసారి అలాంటిదేం లేకుండా ఎలాగైనా సరే థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ 'ప్యారడైజ్'.. నానితో పాటు మిగతా వాళ్లకు ఎందుకంత కీలకం? అసలు జనాలు దీని గురించి ఏమనుకుంటున్నారు?
నాని చాలావరకు కొత్త దర్శకులతోనే కలిసి పనిచేస్తుంటాడు. అలా సుకుమార్ సహాయకుడు శ్రీకాంత్ ఓదెలకు అవకాశమిచ్చి 'దసరా' చేశాడు. మాస్ లుక్‌లో నాని ఆకట్టుకున్నాడు. ఇది మరీ సూపర్ మూవీ అనిపించుకోలేదు గానీ కాస్త డిఫరెంట్‌గా ఆకట్టుకుంది. మళ్లీ ఇదే దర్శకుడితో నాని కలిసి పనిచేస్తున్నాడనేసరికి ఏంటా అంత నమ్మకం అని మాట్లాడుకున్నారు. సరిగ్గా అలాంటి టైంలో 'ప్యారడైజ్' గ్లింప్స్ వదిలారు. ఇది చూసి అంతా షాకయ్యారు.
(ఇదీ చదవండి: నిజానికి మోసపోయింది నేనే: నటి అంబిక)
రెండు జడలతో నాని లుక్, కాకుల రిఫరెన్స్, డార్క్ విజువల్స్, అనిరుధ్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇలా గ్లింప్స్ దెబ్బకు ఒక్కసారిగా 'ప్యారడైజ్'పై బీభత్సమైన హైప్ ఏర్పడింది. ఇదంతా ఏడాది క్రితం అంటే గతేడాది మార్చి టైంలో జరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత అంటే ఈ ఏడాది మార్చి 26న సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఘనంగా ప్రకటించారు. కానీ ఫెర్ఫెక్షన్ కోసం శ్రీకాంత్ ఓదెల పట్టుబట్టడం లాంటి వాటితో షూటింగ్ ఆలస్యమైంది. అనుకున్న టైంకి రిలీజ్ కాలేదు. కట్ చేస్తే ఆగస్టు 21న అని మరోసారి ప్రకటించారు. ఈ తేదీని కూడా అందుకోలేక మళ్లీ వాయిదా వేశారు.
ఫైనల్‌గా సెప్టెంబరు 24న 'ప్యారడైజ్' మూవీ థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. ఈసారి కూడా రిలీజ్ కష్టమే అనే మాటలు వినిపించాయి. కానీ చివరి నిమిషం రీషూట్స్ లాంటివి ఓ పక్క చేస్తూనే మరోవైపు మూవీ ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. ఈ కారణంగా ట్రైలర్ ఏం రిలీజ్ చేయలేదు. కానీ ఆయా షేర్, యేషనాగుల పాటలు బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో కావాల్సినంత హైప్ అయితే ఉంది. కంటెంట్‌తో మెప్పించడమే ఇక మిగిలుంది.
సినిమా మొదలైనప్పుడు ఏకంగా 8 భాషల్లో రిలీజ్ ఉంటుందని ఘనంగా ప్రకటించుకున్నారు. కానీ వాయిదాల కారణమో ఇంకేంటో తెలీదు గానీ ప్రస్తుతానికైతే తెలుగులో తప్పితే మిగతా చోట్ల పెద్దగా బజ్ లేదు. అయినా సరే బెంగళూరు, ముంబై, కొచ్చీ అని తిరుగుతూ ప్రమోషన్స్ చేస్తున్నారు. టీమ్ అంతా తెగ కష్టపడుతున్నారు.
(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న స్టార్ డైరెక్టర్ కూతురు)
ఇప్పటివరకు నాని అంటే మిడ్ రేంజ్ సినిమాలు చేసే హీరోగానే పేరుంది. ఇప్పుడొచ్చే 'ప్యారడైజ్' గనక బ్లాక్‌బస్టర్ హిట్ అయితే ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలున్న టాప్ లీగ్‌లోకి వెళ్లే అవకాశముంటుంది. బుధవారం (సెప్టెంబరు 23) సాయంత్రం ప్రపంచవ్యాప్తంగా పడే ప్రీమియర్లతో నాని భవితవ్యం ఏంటనేది తెలుస్తుంది. గురువారం(సెప్టెంబరు 24) నుంచి రెగ్యులర్ షోలు ప్రదర్శితం కానున్నాయి.
'దసరా'తో హిందీలోనూ కొంత మార్కెట్ ఏర్పరుచుకున్న నాని.. 'ప్యారడైజ్'తో దాన్ని నిలబెట్టుకోవాలి లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. అలానే ఇప్పటివరకు నాని కెరీర్‌లో వచ్చిన చిత్రాలన్నింటికీ బడ్జెట్ అదుపులో ఉండేది. 'ప్యారడైజ్'కి మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువే పెట్టేశారు. ఈ మూవీకి లాభాలు రావాలంటే బీభత్సమైన టాక్ వచ్చి థియేటర్లు రెండు మూడు వారాలైనా కళకళాలాడిపోవాలి. మరి అలా జరుగుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఎదురుచూడాలి?
(ఇదీ చదవండి: నాని స్పెషల్ రిక్వెస్ట్‌కు స్పందించిన సీఎం రేవంత్)


