
'పేపర్ బాయ్' తర్వాత దర్శకుడు జయశంకర్ నుంచి ఎలాంటి చిత్రం రాలేదు. వరుస అవకాశాలు వచ్చినా.. సరైన కాన్సెప్ట్‌తో ఎదురుచూసి మళ్లీ ఇప్పుడు ‘అరి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం కోసం జయశంకర్ ఏడేళ్ల కష్టపడ్డారు. ఇంత సమయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే.. ఇంతవరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌ని ఇందులో చూపించారట. కాన్సెప్ట్ కోసమే ఎక్కువ సమయం తీసుకున్నారట.
'పేపర్ బాయ్' అందించిన గొప్ప విజయం తర్వాత, జయశంకర్ తదుపరి చిత్రం కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల మదిలో నిలిచిపోవాలని బలంగా కోరుకున్నారు. అందుకే, ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ మీద ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో రావాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రయత్నంలోనే, మనిషిలోని ఆరు అంతర్గత శత్రువులైన అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు.
'అరి' అనే పదానికి 'శత్రువు' అనే అర్థంతో పాటు, అరిషడ్వర్గాల్లోని మొదటి రెండు అక్షరాలను తీసుకుని ఈ చిత్రానికి పేరు పెట్టారు. ఈ వినూత్నమైన కాన్సెప్ట్‌ను ప్రేక్షకులకు అందించేందుకు ఆయన విస్తృతమైన పరిశోధన చేశారట. మైథలాజికల్ టచ్ ఇచ్చేందుకు పురాణేతిహాసాలను, గ్రంథాలను అధ్యయనం చేశానని జయశంకర్ చెప్పారు. రమణ మహర్షి ఆశ్రమం సహా పలు ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లి గురూజీలను కలిసి, వారి కోసం వేచి చూసి ఎన్నో విలువైన విషయాలను సేకరించారట. కొంతకాలం ఆశ్రమంలో గడిపి, ఆధ్యాత్మిక కోణంలో ఈ అంశంపై లోతైన పరిశోధన చేశానని జయశంకర్ అన్నారు.
విడుదలకు ముందే, 'అరి' చిత్రం పలు అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శితమై, ఏకంగా 25 అవార్డులను గెలుచుకుంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి ప్రముఖ రాజకీయ, సినీ, పీఠాధిపతులు ఈ చిత్రాన్ని వీక్షించి ప్రత్యేకంగా అభినందించారు. అక్టోబర్ 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. రిలీజ్ తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.