గతంలో వెంగాయం, బయో స్కోప్ లాంటి వైవిధ్యభరిత సినిమాలు తీసిన శంకగిరి రాజ్ కుమార్.. అన్నీ తానై తీసిన తమిళ మూవీ 'వన్ మ్యాన్'. చిత్రంలోని అన్ని పాత్రలు, అన్ని శాఖల్లో ఇతడే పనిచేశాడు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. పీవీఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఇది విడుదల కానుందని శంకగిరి రాజ్ కుమార్ సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
దర్శక నిర్మాత, పాత్రధారుడు శంకగిరి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఇది ఐదేళ్ల శ్రమ అని పేర్కొన్నాడు. ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సింగిల్ మెన్‌గా తానే నటించి, నిర్మించి, దర్శకత్వం వహించినట్లు చెప్పుకొచ్చాడు. ఈ విధంగా ప్రపంచంలోనే రూపొందించిన తొలి చిత్రం ఇదేనని చెప్పాడు.
ఇక ఈ మూవీ విడుదల విషయంలో నిర్మాత కలైపులి ఎస్ థాను సలహా కోసం వెళ్తే.. ఆయన పీవీఆర్ సంస్థ నిర్వాహకులకు ఫోన్ చేసి చెప్పడంతో.. వాళ్లు సినిమా చూసి ఇలాంటి ప్రపంచస్థాయి చిత్ర విడుదలకు తమ సహకారం కచ్చితంగా ఉంటుందని చెప్పారని శంకరగిరి రాజ్ కుమార్ చెప్పుకొచ్చాడు. దర్శకుడు చేరన్ మాట్లాడుతూ శంకరగరి రాజ్ కుమార్ డబ్బు సంపాదించడానికి రాలేదని, ఈయన రూ.70 లక్షలతో బ్రహ్మండ చిత్రం చేయగలరని అన్నారు.


