'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం ఇంతేనా? | Om Shanti Shanti Shantihi Movie Review And Rating In Telugu, A Woman’s Fight For Freedom, Equality And Self Respect | Sakshi
Sakshi News home page

'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. భార్య కోరుకునే మూడు అంశాలు ఏంటి?

Jan 30 2026 9:47 AM | Updated on Jan 30 2026 11:58 AM

Om Shanti Shanti Shantihi Movie Review And Rating

తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’.. మలయాళ హిట్‌ సినిమా జయ జయ జయ జయహే రీమేక్‌గా తెలుగులో తెరకెక్కించారు. ఈ సినిమా నేడు జనవరి 30న విడుదలైంది. మాలయాళంలో రూ. 5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన జయ జయ జయ జయహే మూవీ ఏకంగా రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ మూవీ తెలుగు ఆడియోతోనూ జియోహాట్‌స్టార్‌లో ఉంది. దీంతో చాలామంది సినిమా చూసేశారు. అయితే, ఇదే చిత్రాన్ని రీమేక్‌ చేయడం పెద్ద సాహసమనే చెప్పాలి. మరి ప్రేక్షకులను మెప్పించేంత కంటెంట్‌ ఏమైనా కొత్తగా ఉందా అంటే సినిమా చూడాల్సిందే.

స్త్రీలను మాతృమూర్తులుగా, ఆదిశక్తి స్వరూపులుగా భావించి గౌరవంగా చూసుకోవాలని మన శాస్త్రాలు చెప్తాయి. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, అక్కడ దేవతలు కొలువుంటారని వింటూనే ఉన్నాం. స్త్రీలను గౌరవించని చోట అక్కడ చేసే పనులన్నీ ప్రయోజనం లేనివిగా మారిపోతాయి. ఇదే కాన్సెప్ట్‌తో ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా ఉంటుంది. (Om Shanti Shanti Shantihi Movie Review)

కథేంటంటే..
శాంతి(ఈషా రెబ్బా) చిన్నప్పటి నుంచే తనకు నచ్చినట్లు ఉండాలని అనుకునే అమ్మాయి. మంచి చదువు, ఉద్యోగం తెచ్చుకోవాలని కలలు కంటూ పెరుగుతుంది. ఇంటర్‌ తర్వాత పట్నం వెళ్లి చదువుకోవాలని కోరుకుంటుంది. కానీ, తల్లిదండ్రులు వద్దని చెప్పడంతో ఇంటికి దగ్గరలో ఉన్న ఒక కాలేజీలో డిగ్రీలో చేరుతుంది. తను చదువుకే కాలేజీలో జరిగిన ఒక సంఘటన వల్ల చదువు ఆపేసి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతలో తల్లిదండ్రులు శాంతికి పెళ్లి సంబంధం చూస్తారు. కానీ, తను మాత్రం బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని  అనుకుంటుంది. 

అయితే, ఆమెను పెళ్లి చేసుకునేందుకు నాయుడు (తరుణ్‌ భాస్కర్‌) వస్తాడు. పెళ్లి తర్వాత చదివిస్తానని మాట ఇస్తాడు. దీంతో ఆమె సంతోషంగా పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత నాయుడులోని పురుషాహంకారం బయటకు వస్తుంది. చీటికిమాటికి శాంతిపై చేయి చేసుకుంటాడు. దీంతో శాంతి కన్నీళ్లు పెట్టుకుని తన తల్లిదండ్రులతో చెబితే సర్దుకుపోవాలని సూచిస్తారు. ఒకరోజు రాయుడిపై శాంతి తిరగబడుతుంది. చేయిచేసుకున్న భర్తను శాంతి చితకబాదుతుంది. ఆ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇలాంటి జంట మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి..? విడాకులు తీసుకుందామంటే ఎలాంటి చిక్కులు వచ్చాయి..? ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న శాంతి తన మనసు ఎందుకు మార్చుకుంది..? అనేది తెలియాలంటే ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే:
నేటి సమాజంలో ఆడపిల్లను చిన్నచూపు చూసే కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి. మగపిల్లలను చూసిన తీరు ఆడపిల్లల పట్ల కనిపించదు. చిన్నతనంలోనే కట్టుబాట్ల పేరుతో పెంచుతారు. స్కూల్‌, కాలేజీ రోజుల్లో కూడా వారి చిన్న చిన్న సరదాలను కూడా అడ్డకట్ట వేసి బంధిస్తారు. ఆడపిల్లకు కూడా మనసు ఉంటుంది అనే విచక్షణ మరిచిపోతుంటారు. ఈ కథలో శాంతి పాత్ర కూడా ఇలాగే ఉంటుంది. తన చిన్నతనం నుంచే కుటుంబ సభ్యుల నుంచి పెద్దగా ప్రేమ, సహకారం అందదు. అయినప్పటికీ చదువులో రాణిస్తుంది. మంచి మార్కులతో పాస్‌ అవుతుంది. గొప్ప చదువులు చదివి ఉద్యోగం సాధించాలనే తపనతో శాంతి ఉంటుంది. శాంతి పాత్రను దర్శకుడు తెరకెక్కించిన తీరు చాలా బాగుంది. 

ఇలాంటి అమ్మాయి ప్రతి మధ్య తరగతి కుటుంబంలో కనిపిస్తూనే ఉంటుంది కదా అనే ఫీల్‌ కలుగుతుంది. అత్తారింటికి వెళ్లిన శాంతి అక్కడ పడే ఇబ్బందులు మనం చూస్తే చాలామంది ఆడపిల్లల జీవితాలు క‌ళ్ల‌ముందు మెదులుతాయి. పెళ్లి తర్వాత చదివిస్తానని మాట ఇచ్చిన భర్త.. ఆ తర్వాత దానిని దాటేస్తూ ఉంటాడు. ఈ సమస్య చాలామంది ఆడబిడ్డలకు ఎదురై ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కేవలం ఆరు నెలల్లోనే 21 సార్లు చేయి చేసుకున్న భర్త పదేళ్లలో ఎన్నిసార్లు కొడతాడు.. ఆ లెక్కన 40 ఏళ్లలో ఎన్నిసార్లు దెబ్బలు తినాలి అంటూ శాంతి ప్రశ్నిస్తుంది. దీనికి కుటుంబ సభ్యులతో పాటు అత్తగారింటి నుంచి కూడా సరైన సమాధానం ఉండదు. ఇలా ప్రతి కుటుంబంలో ఎక్కడో చోట జరిగే పలు సంఘటనలే కథలో కనిపిస్తాయి. వాటిని చక్కగా దర్శకుడు తెరకెక్కించాడు.

ఫస్టాఫ్‌ అంతా బాగా కథ నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌లో కాస్త నిరాశపరిచాడనిపిస్తుంది. గృహ‌హింస విష‌యంలో నేటి స‌మాజం ఆలోచ‌న తీరు ఎలా ఉందో చాలా చక్కగా చూపించాడు. భర్తను భార్య కొట్టిందంటే అవ‌మానం అంటారు. అలాంట‌ప్పుడు భార్యను భర్త కొట్ట‌డం ఎవరికీ తప్పు అనిపించదా..? అనేది శాంతి పాత్ర బలంగా ప్ర‌శ్నిస్తుంది. క్లైమాక్స్‌ ట్విస్ట్‌ వరకు ఎలాంటి బోర్‌ లేకుండా సినిమాను చూసేయవచ్చు. సంసార జీవితంలో ఒక అమ్మాయికి ముఖ్యంగా ఉండాల్సిన మూడు విషయాలు ఇవే అంటూ..  ఒక భర్త  నుంచి ప్రతి భార్య కోరుకునేది స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం అని, అవన్నీ కూడా ఆడపిల్ల పుట్టకతోనే వస్తాయని జడ్జి చెప్పిన తీరు ఆలోచింపచేస్తుంది.

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో హీరో ఈషా రెబ్బా అని చెప్పాల్సిందే. ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుంది. మధ్య తరగతి కుటుంబంలో ఉండే అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో మన కళ్లకు కట్టినట్లు తన నటనతో మెప్పించింది. ఓర్పు, సహనం, ప్రేమ ఇలా అన్ని కోణాలు ఆడపిల్ల జీవితంలో ఉంటాయని చూపింది. సహనం కోల్పోయిన తర్వాత ఒక ఆడపిల్ల తిరగబడితే ఎలా ఉంటుందో పవర్‌ఫుల్‌గా కూడా కనిపించింది. రాయుడు పాత్రలో తరుణ్‌ భాస్కర్‌ అదరగొట్టేశాడు. తనలో అద్భుతమైన నటుడు ఉన్నాడని గుర్తుచేశాడు. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త పరిస్థితి ఎలా ఉంటుందో చాలా సెటిల్డ్‌గా చూపించాడు. సంక్రాంతి తర్వాత కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఒక సినిమా చూడొచ్చు అనేలా  ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఉంటుంది.

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement