
తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli). ఆయన కెరీర్‌లో అపజయం అనేదే తెలియదు. మర్యాద రామన్న అనే చిన్న సినిమా మొదలు.. ఆర్‌ఆర్‌ఆర్ అనే భారీ బడ్జెట్ చిత్రం వరకు అన్నీ సూపర్ హిట్లే. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో పాటు ఆస్కార్ మొదలు ఏన్నో అవార్డులను అందించాడు.
ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో బెస్ట్ ఏదంటే.. చెప్పడం కష్టమే. ఎందుకంటే అన్నీ సినిమాలు అద్భుతమైనవే.అయితే చాలా మందికి బాహుబలి(bahubali), ఆర్‌ఆర్‌ఆర్(RRR)చిత్రాలంటే ఎక్కువ ఇష్టమని చెబుతుంటారు. మరి అదే ప్రశ్నను రాజమౌళిని అడిగితే.. బాహుబలి కాదు ఆర్‌ఆర్‌ఆర్ కాదు.. ఈగ తన ఫేవరేట్ ఫిల్మ్ అని చెబుతాడు. తాజాగా జరిగిన జూనియర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజమౌళి ఈ విషయాన్ని చెప్పాడు.
రాజమౌళికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ని తెరపై చూపిస్తూ.. అవి ఏ సినిమాకు సంబంధించినవో గుర్తించాలని యాంకర్ సుమ..జక్కన్నకు టాస్క్ ఇచ్చింది. అలా ఈగ సినిమా స్టిల్స్ రాగానే..జక్కన్న ‘నా ఫేవరేట్ ఫిల్మ్ ఈగ ’అని చెప్పాడు. దీంతో యాంకర్ సుమ.. మీ ఫేవరేట్ ఫిల్మ్ ఈగ అన్నమాట అనగే.. జక్కన్న నవ్వుతూ తల ఊపాడు.
ఈగ సినిమాతోనే రాజమౌళికి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. చిన్న ఈగతో ఆయన చేసిన ప్రయోగం భారీ విజయాన్ని అందించింది. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వాడుకొని హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాను తీర్చిదిద్దాడు జక్కన్న. నాని, సమంత జంటగా నటించిన ఈ చిత్రం 2012లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.